అమెరికా కూడా భారత్ బాటలోనే …
టిక్‌టాక్‌ను భారత్ నిషేధించడంపై అమెరికాలోని చట్టసభ ప్రతినిధుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. దేశ భద్రతకు టిక్‌టాక్‌తో ప్రమాద ముందుని, అమెరికా కూడా భారత్ బాటలోనే టిక్‌టాక్‌ను నిషేధించాలని వారు కోరుతున్నారు. ప్రమాదకరమైన ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో భారత్ టిక్‌టాక్‌తో పాటు డజన్ల కొద్దీ చైనా యాప్‌లను నిషేధించింది అని రిపబ్లికన్ సెనేటర్ జాన్ కొర్నిన్ ట్వీట్ చేశారు. టిక్‌టాక్ వెళ్లిపోవాలి. అది గతంలోనే వెళ్లిపోయుండాల్సింది అని రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రిక్ క్రాఫోర్డ్ ట్వీట్లో పేర్కొన్నారు. చైనా ప్రభుత్వం టిక్‌టాక్‌ను తన సొంత ప్రయోజనాల కోసం వినియోగిస్తోందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్ గతవారం ఆరోపించారు.
అమెరికాలో 4 కోట్ల వినియోగదారులు ఉన్న టిక్‌టాక్ చైనా కమ్యూనిస్ట్ పార్టీకి, బీజింగ్ విధానాలకు వ్యతిరేకంగా పెట్టే పోస్టులను తొలగిస్తోంది అని ఒబ్రెయిన్ వ్యాఖ్యానించారు. కాగా అమెరికాలో ప్రభుత్వ అధికారులు తమ ఫోన్లలో టిక్‌టాక్ వాడకుండా నిషేధించాలంటూ ఇప్పటికే రెండు బిల్లులు చట్టసభల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రముఖ రచయిత గొర్డాన్చాంగ్ చైనా యాప్‌ల నిషేధాన్ని ప్రస్తావిస్తూ అమెరికా ఎందుకు ఆ పని చేయదు అని ప్రశ్నించారు. తాజాగా భారత ప్రభుత్వ నిర్ణయం తర్వాత వీటిపై మళ్లీ చర్చ జరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.













