అధ్యక్ష గెలుపును నిర్ణయించేవి ఈ రాష్ట్రాలే ….
అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య పోటీ హోరా హోరీగా ఉండే రాష్ట్రాలను బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటారు. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉండగా ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య పోటీ నువ్వా-నేనా అనే విధంగా ఉన్నది. అధ్యక్ష ఎన్నికల అంతిమ ఫలితాలను నిర్ణయించేవి కూడా ఈ రాష్ట్రాలే. 2016 అధ్యక్ష ఎన్నికల్లో మిగతా రాష్ట్రాల్లో మంచి ప్రదర్శన కనబరిచిన అప్పటి డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్.. ఈ 14 రాష్ట్రాల్లో ఎలక్టార్లను (స్థానాల్ని) గెలుచుకోవడంలో తడబడ్డారు. దీంతో ఆమె అధ్యక్ష పీఠానికి దూరమయ్యారు. అయితే, ఈ కీలక రాష్ట్రాల్లో ఇప్పటికే బ్యాలెట్ ద్వారా ఓట్లేసిన చాలా మంది ఓటర్లు తమ మద్దతు జో బిడెన్‌కే అని చెప్పినట్లు నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఫ్లోరిడా, నార్త్ కరోలినా తదితర రాష్ట్రాలు ఉన్నాయి.













