హెచ్-1 బి వీసాలకు కొత్త నిబంధనలు
హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ కఠిన వైఖరితో అమెరికాలో ఉన్న చిన్న, మధ్య తరహా ఐటీ సంస్థల భవిష్యత్ అనిశ్చితిలో పడింది. దీనికితోడు తాజాగా మరిన్ని నిబంధనలను తెచ్చారు. అమెరికన్ల యాజమాన్యంలోని సంస్థలు తమ వద్ద ఎంతమంది విదేశీ ఉద్యోగులు పనిచేస్తున్నారనే వివరాలను ప్రభుత్వానికి వెల్లడించాలని, వాటి ఆధారంగా.. నూతన హెచ్1బీ దరఖాస్తులకు అనుమతిస్తామని స్పష్టంచేసింది. భారత ఐటీ నిపుణులు ప్రధానంగా హెచ్1బీ వీసాపైనే ఆశలు పెట్టుకుంటారు. స్థానికులకే అమెరికా ఉద్యోగాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన హామీని నెరవేర్చేందుకు హెచ్1బీ వీసాల జారీ విధానంలో భారీ మార్పులకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక ఆంక్షలు, నిబంధనలను ప్రభుత్వం విధించింది. ఏదైనా సంస్థ విదేశీ ఉద్యోగికి హెచ్1బీ వీసా ఇవ్వాలంటే, సదరు కంపెనీ తన లేబర్ అప్లికేషన్‌కు కార్మికశాఖ నుంచి అనుమతి పొందాలి.













