నిరాశపరిచిన అమెరికా జాబ్ డేటా

అమెరికాలో ఉద్యోగుల నియామకాలు గతనెల్లో అంతంత మాత్రంగా నమోదైయ్యాయి. ఆగస్టులో 1,30,000 మందికి నూతనంగా ఉపాధి లభించింది. ప్రభుత్వం ప్రకటించిన సమాచారం ప్రకారం అంచనాల కంటే చాలా తక్కువగా ఉందని వెల్లడైంది. గతేడాది ఇదేకాలానికి 2,41,000 మందికి ఉపాధి లభించగా.. గడిచిన మూడు నెలలు సగటు 1,56,000 పొజిషన్లుగా తాజా డేటా ద్వారా తేలింది. ఈ సమాచారం ఆధారంగా ఆగస్టులో ఆశించిన స్థాయి కంటే తక్కువ ఉద్యోగాలు నమోదయ్యాయి. ఉద్యోగ కల్పనలో కీలక రంగాలైన సేవా రంగం, రిటైల్, రవాణా వంటి రంగాలు కూడా ఉద్యోగుల భర్తీలో గతనెల్లో వెనకడుగు వేసిన కారణంగా ఈ స్థాయిలో తగ్గుదల నమోదైందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ఇందుకు ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక నిరుద్యోగుల రేటు 3.7 శాతంగా కొనసాగుతోంది.











































































