గ్రీన్‌కార్డు ఆశలకు అమెరికా బ్రేకులు
పెట్టుబడిదారులకు అమెరికా ప్రభుత్వం షాకిచ్చింది. ఎంప్లాయి బేస్డ్, ఫిఫ్త్, ప్రిఫరెన్స్ (ఈబీ-5) ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసాను ఆధునీకరించినట్టు యూఎస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ ప్రకటించింది. ఆధునీకరణలో భాగంగా ఇప్పటివరకు ఉన్న 5 లక్షల డాలర్ల (రూ.3,44,40,000,00) పెట్టుబడి మొత్తాన్ని 9 లక్షల డాలర్ల (రూ.6,19,74,000,00)కు పెంచినట్టు తెలిపింది. ఈబీ-5 కింద పెట్టుబడిదారులు అమెరికాకు చెందిన కమర్షియల్ కంపెనీలో పెట్టుబడి పెట్టి పది మంది అమెరికన్లకు పుల్ టైమ్ ఉద్యోగాలను కల్పించాలి. ఇలా చేసిన యెడల ఆ పెట్టుబడిదారులకు అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డులను చట్టపరంగా జారీ చేస్తుంది.
అయితే ఇప్పుడు పెట్టుబడి మొత్తాన్ని దాదాపు రెండు రెట్లు చేయడంతో ముఖ్యంగా భారతీయ పెట్టుబడిదారులపై ఇది ఎక్కువ ప్రభావం చూపనుంది. పెట్టుబడి మొత్తంతో పాటు టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియాస్(టీఈఏ) హోదాలోనూ సంస్కరణలు చేపట్టారు. కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలను ప్రతి ఐదేళ్లకు సమీక్షిస్తూ ఉంటారు. అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఈ పెట్టుబడి మొత్తం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త సంస్కరణలు నవంబరు 21 నుంచి అమలు అవుతాయని ఈ లోగా పెట్టుబడి పెట్టే వారికి పాత విధానమే అమలు అవుతుందని యూఎస్ ఇమిగ్రేషన్ లాయర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వివేక్ తాండన్ చెబుతున్నారు.













