US: సుబ్రహ్మణ్యం వేదం కేసు.. యూఎస్ న్యాయవిభాగం తీరుపై సర్వత్రా చర్చ
సుబు వేదం.. అసలు ఈ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కథ వింటే గుండె తరుక్కుపోతుంది. అగ్రరాజ్యంలో జీవితాంతం గడిపిన సుబు.. చేయని నేరానికి అరెస్టై శిక్ష అనుభవించాడు. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 43 ఏళ్లపాటు సుదీర్ఘ జైలు శిక్ష . అంటే ఓ మనిషి జీవితంలో అత్యధిక భాగం జైల్లోనే గడపడం. అదికూడా తన తప్పులేని శిక్షకు ఫలితం అనుభవించాడు. ఇటీవలే కేసు నుంచి విడుదలైన సుబు వేదంను.. ఇప్పుడు మరోకేసులో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే…ఆయనను దేశం నుంచి బహిష్కరించవద్దని ఇమిగ్రేషన్ అధికారులను అమెరికాకు చెందిన రెండు న్యాయస్థానాలు ఆదేశించాయి. ప్రస్తుతం ఆయన లూసియానాలోని ఓ నిర్భంధ కేంద్రంలో ఉన్నారు. 43 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని.. మరోకేసులో అదుపులోకి తీసుకోవడం అక్కడి ఇండియన్లలో తీవ్ర చర్చనీయాంశమైంది.
సుబ్రహ్మణ్యం వేదంపై నమోదైన మాదకద్రవ్యాల కేసులో ప్రస్తుతం తిరిగి భారత్ కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం డిపోర్టేషన్ పై ఇమిగ్రేషన్ జడ్జి స్టే విధించారు. ఆయన కేసును సమీక్షించాలా, వద్దా దానిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అప్పీల్స్ నిర్ణయం తీసుకునే వరకు నిలిపివేయాలని ఆదేశించారు. మరోవైపు పెన్సిల్వేనియాలోని జిల్లా కోర్టు కూడా బహిష్కరణపై స్టే విధించింది. దీంతో దేశం నుంచి బహిష్కరణపై ప్రస్తుతానికి ఆయనకు ఊరట లభించింది.
సుబు వేదం కేసేంటి..?
1962లో సుబ్రహ్మణ్యం వేదం కుటుంబం అమెరికాకు చట్టబద్ధంగా వలస వచ్చింది. ఆ సమయంలో ఆయనకు తొమ్మిది నెలలు ఉంటాయి. పెన్సిల్వేనియాలోని స్టేట్ కాలేజీలో స్థిరపడిన సుబ్రహ్మణ్యం కుటుంబానికి అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. 1980లో తన స్నేహితుడు థామస్ కిన్సర్ కనిపించకుండా పోయాడు. తొమ్మిది నెలల తర్వాత శవమై కనిపించాడు. అయితే చివరిసారిగా థామస్‌తో సుబ్రహ్మణ్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు 1982లో అరెస్ట్ చేశారు. సరైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయనపై హత్యా నేరం అభియోగాలు మోపారు. దీంతో 1983లో కోర్టు దోషిగా తేల్చి పెరోల్ లేకుండా జీవితఖైదు విధించింది. ఆయన కుటుంబ సభ్యులు దశాబ్దాల పాటు న్యాయపోరాటం చేశారు. అయితే 2022లో అక్రమంగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారికోసం పోరాడుతున్న ఓ స్వచ్ఛంద సంస్థ సుబ్రహ్మణ్యానికి అండగా నిలిచింది. ఈ కేసును సమీక్షించి న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం కొనసాగించింది. చివరకు సరైన ఆధారాలు లేవని తేలడంతో పెన్సిల్వేనియా కోర్టు ఇటీవల అతడిని నిర్దోషిగా ప్రకటించింది. దీంతో అక్టోబర్ 3న జైలు నుంచి విడుదల చేసింది. కానీ అక్కడే సుబ్రహ్మణ్యంను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మాదక ద్రవ్యాల సరఫరా కేసులో దోషి
అయితే హత్య కేసులో అరెస్ట్‌కు కొంతకాలం ముందు సుబ్రహ్మణంపై మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు నమోదైంది. ఈ కేసులో ఆయన దోషిగా తేలడంతో చట్టపరంగా దేశ బహిష్కరణ ముప్పు ఎదురైంది. హత్య కేసులో జైల్లో ఉండటంతో దీనికి బ్రేక్‌లు పడ్డాయి. 43 సంవత్సరాలు తర్వాత జైలు నుంచి విడుదలైన సుబ్రహ్మణ్యంను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మాదక ద్రవ్యాల కేసును కారణంగా చూపుతూ ఇప్పుడు ఆయన్ను దేశం నుంచి బహిష్కరించాలని ఐసీఈ అధికారులు ప్రయత్నిస్తున్నారు. హత్య కేసులో తీర్పు మారినంత మాత్రాన, డ్రగ్స్ కేసు శిక్ష రద్దు చేయలేదని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాదిస్తోంది. చేయని నేరానికి 43 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారని, ఇది డ్రగ్స్ కేసులో విధించే శిక్ష కంటే ఎక్కువేని సుబ్రహ్మణ్యం న్యాయవాదులు, ఆయన సోదరి మళ్లీ న్యాయపోరాటం మొదలుపెట్టారు.







