భారత్ ఆ అడ్డు గోడలు తొలగించాలి : అమెరికా
అమెరికా కంపెనీల విషయంలో వాణిజ్య అడ్డంకులను, కఠిన నిబంధనలను తొలగించాలని అమెరికా వాణిజ్య కార్యదర్శి విల్బర్ రోస్ భారత్కు విజ్ఞప్తి చేశారు. ట్రేడ్ విండ్స్ ఫోరమ్ అండ్ ట్రేడ్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. వ్యాపార నిర్వహణ వ్యయాన్ని తగ్గించాలని, డేటా పరిమితులను కూడా ఎత్తివేయాలన్నారు. మా లక్ష్యం ఒక్కటే. డేటా పరిమితులతో సహా అక్కడ కార్యకలాపాలను నిర్వహిస్తున్న అమెరికా కంపెనీలపై భారత్ విధిస్తున్న పరిమితులను నిబంధనలను తొలగించేలా చూడటమే అని అన్నారు. ఆటోమొబైల్, మోటర్సైకిళ్లు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆల్కహాల్ తదితర ఉత్పత్తులపై భారత్ అధిక దిగుమతి సుంకాలను వసూలు చేస్తోందని అన్నారు.
ప్రస్తుతం భారత్లో అమెరికా కంపెనీల వ్యాపారానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఇందులో సుంకాలు విధించేవి, విధించనవి కూడా ఉన్నాయి. భారత్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు, నియమ నిబంధనల వల్ల విదేశీ కంపెనీలకు ప్రతికూలంగా ఉంది. భారత్ సగటును 13.8 శాతం సుంకాలు విధిస్తోంది. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, ఇది చాలా ఎక్కువ. ఆటో మొబైల్ వస్తువులపై అమెరికా 2.5 శాతం పన్ను విధిస్తుంటే, భారత్లో 60 శాతంగా ఉంది. అదే విధంగా మోటర్ సైకిళ్లపై 50 శాతం, మద్యం ఉత్పత్తులపై 150 శాతం పన్నులు విధిస్తున్నారు. ఇంకా వ్యవసాయ ఉత్పత్తులపై 113.5 శాతంగా ఉండగా, మరి కొన్నింటిపై ఏకంగా 300 శాతం ఉంది అని పేర్కొన్నారు.













