TTA: డిసెంబర్ 9 నుంచి ‘టీటీఏ సేవాడేస్ 2025’ ప్రారంభం
అమెరికాలో అతిపెద్ద తెలంగాణ సంఘం ‘టీటీఏ’
▪️ తెలంగాణలో ‘టీటీఏ’ భారీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం
▪️ డిసెంబర్ 25న ‘టీటీఏ’ 10వ వార్షికోత్సవం
▪️ డిసెంబర్ 14న గచ్చిబౌలిలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం
▪️ 40కి పైగా సేవా కార్యక్రమాలను ప్రకటించిన ‘టీటీఏ’
తెలుగు కళల తోట.. తెలంగాణ సేవల కోట.. అంటూ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలో ఘనంగా నిలబెడుతున్న ‘తెలంగాణ అమెరికా తెలుగు సంఘం’ (TTA) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో “సేవాడేస్ 2025” కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఈ TTA సేవాడేస్ 2025 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ జిల్లాల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 14న గచ్చిబౌలిలో “10K రన్”తో డ్రగ్స్‌పై భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. డిసెంబర్ 25న TTA 10వ వార్షికోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీఏ నాయకులు ‘టీటీఏ సేవాడేస్ 2025’ ప్రకటించి, కార్యక్రమాల వివరాలు తెలిపారు.
TTA ఏటా నిర్వహించే ఈ సేవాడేస్‌లో భాగంగా ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి, యువత అవగాహనా కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నివారణపై చైతన్యం, రక్తదానం, ఆహార పంపిణీ, గిరిజన ప్రాంతాలకు మద్దతు.. వంటి 40కి పైగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. TTA సేవాడేస్‌లో భాగంగా సేవ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, నల్లగొండ, యాదాద్రితో పాటు మరిన్ని జిల్లాల్లో నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమాలను TTA నాయకత్వ బృందం రూపొందించింది. TTA ఫౌండర్ పైల మల్లారెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, ఏసీ-చైర్ విజయపాల్ రెడ్డి, ఏసీ కో చైర్ మోహన్ రెడ్డి పటలోళ్ల,సేవాడేస్ సలహాదారు డా. ద్వారకానాథ్ రెడ్డి, TTA కన్వెన్షన్ 2026 చైర్ ప్రవీణ్ చింతా, 10వ వార్షికోత్సవ చైర్ DLN రెడ్డి, జాయింట్ ట్రెజరర్ స్వాతి చెన్నూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ – ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ జ్యోతి రెడ్డి దూదిపాల, EX BOD రమా కుమారి వనమా, అంతర్జాతీయ VP నర్సింహ పెరుక, సేవాడేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, 10వ వార్షికోత్సవ వేడుక కల్చరల్ చైర్ డా. వాణి గడ్డం.. అమెరికా నుండి TTA నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
TTA 10వ వార్షికోత్సవం
2025 డిసెంబర్ 25న TTA తన 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతోంది. గడిచిన దశాబ్ద కాలంలో TTA చేసిన సేవా కార్యక్రమాలు, సామాజిక సేవ, తెలంగాణతో ఉన్న అనుబంధం వంటి అంశాలు ఈ వేడుకలో ప్రధానంగా చోటు చేసుకుంటాయి. పదేళ్లుగా తెలంగాణతో తమ బంధం మరింత బలపడుతోందని టీటీఏ నాయకులు తెలిపారు.
“10K రన్”తో డ్రగ్స్‌పై అవగాహన
టీటీఏ సేవాడేస్ 2025లో భాగంగా డిసెంబర్ 14న గచ్చిబౌలిలో Say No To Drugs సందేశంతో “10K రన్” నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది సేవాడేస్ ప్రధాన థీమ్ “Say No To Drugs” అని టీటీఏ నాయకులు తెలిపారు. ఈ రన్లో విద్యార్థులు, యువత, స్పోర్ట్స్ కమ్యూనిటీ, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఫిట్నెస్ను ప్రోత్సహించడంతో పాటు డ్రగ్స్ అవగాహన కోసం సమాజానికి బలమైన సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యమని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు కీలకమని TTA నాయకత్వం తెలిపింది.
2014లో అమెరికాలో స్థాపించిన TTA సంస్థ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో వేలాది మందికి సేవలు అందిస్తూ అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలంగాణ సంఘాలలో ఒకటిగా నిలిచింది.
-Varma






