TTA: వరంగల్లో TTA ‘సేవా డేస్’ సందడి.. మహిళలకు ఉచిత వైద్యం, దివ్యాంగులకు అండ
హన్మకొండ: సమాజ సేవలో ముందుండే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సేవా డేస్’ కార్యక్రమాలు వరంగల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీనివాస్ నగర్ కాలనీలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మహిళల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని, దివ్యాంగ పిల్లల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా…
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) సహకారంతో మహిళలకు గైనకాలజీ, కంటి, ముక్కు, చెవి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. విదేశాల్లో ఉంటూ సొంత గడ్డపై ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని కొనియాడారు.
డిసెంబర్ 22 వరకు పలు జిల్లాల్లో సేవలు: జ్యోతి రెడ్డి
TTA బోర్డు ఆఫ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ జ్యోతి రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 8 నుంచి 22 వరకు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. దివ్యాంగ పిల్లల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడటమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. మల్లికాంబ కేంద్రంలో సాయిబాబా గుడి నిర్మించడం తనకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. అనాథ పిల్లల వసతి గృహాలను నిర్వహిస్తున్న వారికి ప్రభుత్వం మరింత సహకారం అందించాలని ఆమె కోరారు. జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ద్వారా కూడా దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి మల్లిపెద్ది (TTA ప్రెసిడెంట్). విజయపాల్ రెడ్డి (AC చైర్), విశ్వ కాండి (సేవా డేస్ చైర్), శివా రెడ్డి కొల్ల (జనరల్ సెక్రటరీ), ప్రవీణ్ చింత (కన్వెన్షన్ కన్వినర్), నరసింహ పెరుక (ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్), బోర్డు సభ్యులు L.N రెడ్డి, సహోదర్ రెడ్డి, స్వాతి చెన్నూరు, శ్రీనివాస్ గూడూర్, సంతోష్ గంగారాము, వాణి గడ్డం, ఉషా రెడ్డి, రఘు అలుగుబెల్లి, ప్రదీప్ బొడ్డు తదితరులు పాల్గొన్నారు.






