TTA Seva Days: విజయవంతంగా ‘TTA సేవా డేస్–2025’ వేడుకలు
▪️ తెలంగాణలో భారీ ఎత్తున టీటీఏ పలు సేవా కార్యక్రమాలు
▪️ 2 వారాల పాటు పలు జిల్లాల్లో ‘టీటీఏ సేవా డేస్ 2025’
హైదరాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “TTA సేవా డేస్ – 2025” సేవా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, అవసరమైన సామగ్రి పంపిణీ వంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు రెండు వారాల పాటు పలు జిల్లాల్లో నిర్వహించారు.

హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్గొండ, మెదక్ సహా పలు జిల్లాల్లో వైద్య శిబిరాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్‌లు ప్రారంభించి, బెంచీలు, యూనిఫామ్‌లు, ఎగ్జామ్ ప్యాడ్లు, జ్యామెట్రీ బాక్సులు అందజేశారు. పాఠశాలల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆలయాల పునర్నిర్మాణం కూడా చేపట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో 10కే రన్‌ను కూడా నిర్వహించారు. వృద్ధుల కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన క్యారం బోర్డు ఛాంపియన్షిప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ మహా సేవా కార్యక్రమాలను టీటీఏ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెడ్డి నాయకత్వంలో టీటీఏ సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, ఫౌండర్ డా. పైళ్ళ మల్లా రెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డా. విజయపాల్ రెడ్డి, కో-చైర్ మోహన్ రెడ్డి పటలోల్ల, అడ్వైజరీ సభ్యులు భరత్ రెడ్డి మాదడి, శ్రీని అనుగు, పూర్వ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల, ఇండియా కోఆర్డినేటర్ డా. ద్వారకానాథ రెడ్డి, ఇండియా సేవా డేస్ కోఆర్డినేటర్ మధుకర్ రెడ్డి బీరాం, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యుల మార్గదర్శకత్వం ఈ భారీ సేవా కార్యక్రమాలకు తోడ్పడింది.
అమెరికా నుండి వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న టీటీఏ టీమ్ సభ్యులకు, ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రోత్సహించిన స్పాన్సర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా టీటీఏ మహాసభలు “టీటీఏ మెగా కన్వెన్షన్ – 2026” జూలై 17–19, 2026లో షార్లెట్, నార్త్కరోలైనాలో జరుగనున్నట్లు టీటీఏ నాయకులు వెల్లడించారు.






