సింగపూర్ సదస్సుపై వచ్చేవారంలో నిర్ణయం
కొరియా ద్వీపాన్ని అణ్వస్త్రరహితంగా మార్చడమే లక్ష్యంగా వచ్చే నెల 12న ఉత్తర కొరియాతో జరిగే సింగపూర్ సదస్సుపై వచ్చేవారంలో నిర్ణయం తీసుకుంటామని అమెరికా ప్రకటించింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు నిరసగా సింగపూర్ సదస్సు నుంచి వైదొలగనున్నట్లు ప్యాంగాంగ్ హెచ్చరించిన మరుసటి రోజే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సింగపూర్ చర్చల గురించి వచ్చేవారం తెలుస్తుందని, అక్కడికి వెళితే ఉత్తరకొరియాకు గొప్ప విషయమవుతుందని శ్వేతసౌధంలో మీడియా ప్రతినిధులతో ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు అమెరికా, ఉత్తరకొరియా తొలి సదస్సుపై నీలినీడలు కమ్ముకున్న వేళ శ్వేతసౌధం మాత్రం సింగపూర్ ఏర్పాట్లపై ముందుకు సాగుతోంది.













