చైనాతో వాణిజ్య ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ విముఖత
చైనాతో రెండో దశ వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విముఖత వ్యక్తం చేశారు. కరోనాను అదుపు చేయడంలో చైనా ఘోరంగా విఫలమైనందున రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని ఈ కారణంగా ఒప్పందం గురించి తాను ఆలోచించడం లేదని ఆయన సృష్టం చేశారు. రెండు దేశాల మధ్య విస్తృతమైన చర్చల తరువాత ఈ ఏడాది మొదట్లో అమెరికా చైనాతో భారీ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనా వైరస్ వ్యాపించిన తరువాత రెండు దేశాల సంబంధాలు దిగజారాయి. హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయడం, అమెరికా జర్నలిస్టులపై ఆంక్షల విధింపు యువైగుర్స్ ముస్లింల పట్ల తీవ్ర వివక్షత, టిబెట్‌లో భద్రతా చర్యలు ఇవన్నీ చైనాకు అమెరికా దూరం కాడానికి దారి తీశాయి.













