మరిన్ని దేశాలపై అమెరికా నిషేధం
భద్రత నిబంధనలను పాటించడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ, పలు దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధాజ్ఞలు జారీ చేశారు. వీసా అనుమతులపై ఆంక్షలు విధించే దస్త్రాలపై సంతకం చేశారు. ఇప్పటికే నిషేధం ఉన్న ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, వెనిజులా, ఉత్తర కొరియా పౌరుల ప్రవేశంపై నిషేధం కొనసాగుతుందని ఆయన సృష్టం చేశారు. వీటికి అదనంగా మయన్నార్, ఎరిట్రియా, కిర్గిజిస్తాన్, నైజీరియా వలసదారులకు వీసాలు ఇవ్వరాదని అమెరికా నిర్ణయించింది.
సూడాన్, టాంజానియా దేశాల పౌరులు వీసా లాటరీలో పాల్గొనే అవకాశాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మేరకు వైట్ హౌస్ సమచార శాఖ మంత్రి స్టెఫానియా గ్రేషమ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆంక్షలు టూరిస్టులు, వ్యాపారులు, వలసేతర ప్రయాణికులకు వర్తించబోవని గెషమ్ సృష్టం చేశారు. అంతర్జాతీయ భద్రత నిబంధనలను పాటించకుంటే పరిస్థితి ఎలా ఉంటుందన్నది అర్థమయ్యేలా చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని యాక్టింగ్ సెక్రటరీ చాడ్ ఎఫ్ వోల్ఫ్ తెలిపారు.













