ఎఫ్ బీఐ నూతన సారధిగా క్రిస్టోఫర్!
అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)కు తదుపరి డైరెక్టర్‌గా మాజీ అటార్నీ జనరల్ క్రిస్టోఫర్ రే(50)ను నియమించే ఆలోచనలో ఉన్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. క్రిస్టోఫర్ అత్యంత నిజాయితీపరుడైన వ్యక్తి అని కొనియాడారు. సెనేట్ ఆమోదం పొందిన వెంటనే ప్రస్తుతం ఎఫ్‌బీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆండ్రూ మెక్‌కేబ్ నుంచి క్రిష్టోఫర్ బాధ్యతలు స్వీకరిస్తారు. న్యాయశాఖలో 2003-05 కాలంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా పనిచేసిన క్రిస్టోఫర్, ఎన్రాన్ స్కాంతో పాటు, సెప్టెంబరు 11 ఉగ్రవాదుల విచారణలో కీలకంగా వ్యవహరించారు. గతేడాది నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యన్ల జోక్యంపై సెనేట్ సెలెక్ట్ ఇంటెలిజన్స్ కమిటీ ముందు మాజీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ సాక్ష్యమివ్వనున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.













