శ్వేతసౌధంలో ట్రంప్ ఇఫ్తార్ విందు
రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అందరికీ భద్రత, సౌభాగ్యం కలిగిన భవిష్యత్తును అందించేందుకు ముస్లిం దేశాల సహకారాన్ని ఆయన అభ్యర్థించారు. ట్రంప్ ఇఫ్తార్ విందు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని, గతేడాది అధికారం చేపట్టిన అనంతరం ఆయనే ఆపేశారు. 2017లో ఆయన ఇఫ్తార్ విందును ఇవ్వలేదు. ఈసారి మాత్రం విందును ఏర్పాటు చేసి, వివిధ ముస్లిం దేశాల రాయబారులు, అధికారులను ట్రంప్ ఆహ్వానించారు. ముస్లింలకు వ్యతిరేకంగా తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆయన, తాజా ప్రసంగంలో వారికి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, కేబినెట్ సభ్యులూ ఇందులో పాల్గొన్నారు. ఇటు ముస్లింలపై ట్రంప్ చూపే వివక్షకు వ్యతిరేకంగా శ్వేతసౌధం బయట కొన్ని ముస్లిం పౌర హక్కుల సంస్థలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. నాట్ ట్రంప్స్ ఇఫ్తార్ పేరుతో విందును ఏర్పాటు చేశాయి.













