7.5 లక్షల మంది డ్రీమర్స్ వెనక్కి..?
డీఏసీఏ పథకాన్ని రద్దు చేయనున్న ట్రంప్..7 వేల మంది ఇండో-అమెరికన్లపై ప్రభావం..ఇంటా, బయటా వెల్లువెత్తుతున్న వ్యతిరేకత
అమెరికాకు చిన్నపిల్లలుగా వెళ్లి తల్లిదండ్రులతోపాటు అక్కడే స్థిరపడి ఇప్పుడు పనులు చేసుకుంటున్న వారిని (డ్రీమర్స్‌ను) అక్రమ వలసదారులుగా గుర్తించేందుకు రంగం సిద్ధమవుతున్నది. వారు దేశం విడిచి వెళ్లేలా ఆదేశించే పత్రాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో సంతకం పెట్టనున్నారు. ఇది అమల్లోకి వస్తే దాదాపు 7.5 లక్షల మందిపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. సుమారు 7000 మంది ఇండో-అమెరికన్లు దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని చెప్తున్నారు. నిబంధనల ప్రకారం డ్రీమర్స్ పెద్దయ్యాక తిరిగి స్వదేశాలకు వెళ్లాలి. అయితే వారు అమెరికాలోనే ఉంటూ పనులు చేసుకునే అవకాశం కల్పిస్తూ 2012లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా డిఫర్డ్ యాక్షన్ ఫర్ చిల్డ్రన్ అరైవల్ (డీఏసీఏ) పథకం ప్రవేశపెట్టారు. ఇందులో పేరు నమోదు చేసుకున్నవారు రెండేండ్ల పాటు అమెరికాలో ఉండొచ్చు. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తాను అధికారంలోకి వస్తే వెంటనే రద్దు చేస్తానని ప్రకటించారు. అయితే డీఏసీఏను రద్దు చేస్తే ప్రతిపక్షాలతోపాటు, సొంతపార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే పలువురు బహిరంగంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ పాల్ రేయాన్ సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. డ్రీమర్లు ఏండ్లుగా ఇక్కడే పెరిగారని, ఇప్పుడు వారికి అమెరికా తప్ప వేరే సొంత దేశం లేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. డీఏసీఏ రద్దు నిర్ణయాన్ని ఆరు నెలలపాటు వాయిదా వేయించి, కాంగ్రెస్‌లో చర్చించి చట్టం చేయించాలన్న ఆలోచనలో వైట్‌హౌస్ వర్గాలు ఉన్నట్టు సమాచారం.













