వైరస్ వ్యాప్తిలో ట్రంప్ విఫలం : జో బైడెన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీలు, కరోనా వైరస్ సూపర్ స్పైడర్ కార్యక్రమాలని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ విమర్శించారు. ఎన్నికల్లో కరోనా కీలక అంశంగా మారడంతో, వైరస్ వ్యాప్తిలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారంటూ బైడెన్ విమర్శలు తీవ్రంగా చేశారు. టంపాలో ట్రంప్-మెలానియా ప్రచారం ముగిసిన కొన్ని గంటలకే బైడెన్ ప్రచారం నిర్వహించారు. ట్రంప్ ఇప్పుడే ఇక్కడ ఓ సూపర్ స్పైడర్ కార్యక్రమం నిర్వహించారు. వాళ్లు కేవలం కరోనా వైరస్‌నే కాదు.. విభజనవాదాన్ని, అసమ్మతిని వ్యాపింపజేస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు. రిపబ్లికన్ల సభలకు వచ్చేవారిలో చాలామంది మాస్కులు ధరించకపోవడం, గుంపులుగా పోగవడాన్ని గుర్తు చేస్తూ కరోనాపై పోరును ట్రంప్ అధికార యంత్రాంగం గాలికొదిలేసిందని బైడెన్ ధ్వజమెత్తారు.
గతవారం అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో వైరస్‌తో కలిసి జీవించాలని ట్రంప్ అన్నారు. ఇప్పుడు వైరస్ బారిన పడి చనిపోవడం కూడా నేర్చుకోవాలంటున్నారు. మనల్ని, మన కుటుంబాలను కరోనాకు లొంగిపోవాలని వదిలేశారు అంటూ బైడెన్ విమర్శలు గుప్పించారు. తాను అధికారంలోకి వస్తే నిపుణులతో కలిసి బాధ్యతగా వ్యవహరిస్తూ వైరస్‌ను నియంత్రిస్తానని చెప్పారు.













