కరోనా టైమ్‌లో ఇండియా నుంచి అట్లాంటా ప్రయాణం…
హనుమంతరావు దిగుమర్తి అనుభవం
అట్లాంటాకు చెందిన హనుమంతరావు దిగుమర్తి కరోనా లాక్డౌన్ పిరియడ్‌లో ఇండియాలో చిక్కుకుని పోయి చివరకు అమెరికా ప్రభుత్వ చేయూతతో అట్లాంటాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇండియాలో ఈ లాక్డౌన్ పిరియడ్‌లో తన ప్రయాణ అనుభవాలను ఆయన పాఠకులతో పంచుకున్నారు.
భారతదేశంలో తమబంధుమిత్రులతో, వేడుకల్లో పాల్గొనడంకోసం హనుమంతరావు మార్చి 5వ తేదీన ఇండియాకు పయనమయ్యారు. ఇండియాకు వెళ్ళే ముందే అమెరికాలో ఉన్న అంటువ్యాధుల నిపుణునిగా ఉన్న ఆయన బంధువుతోనూ, ఇండియాలో ఉన్న తెలిసిన డాక్టర్‌తో కరోనా వైరస్ వేళలో తమ ప్రయాణం చేయవచ్చా లేదని సలహా తీసుకున్నారు. అమెరికాలో ఉన్న తన బంధువు ప్రయాణానికి ఇది సరైన సమయం కాదని సూచించారు. కాని ఇండియాలో ఉన్న డాక్టర్ మాత్రం జాగ్రత్తలు పాటిస్తే వైరస్ మనల్నేమి చేయదని భరోసా ఇచ్చారు. దాంతో హనుమంతరావు తన భార్యతో కలిసి అట్లాంటా నుంచి బయలుదేరి మార్చి 5న ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో అటు అమెరికాలోనూ, ఇటు ఇండియాలోనూ కరోనా వైరస్ పెద్ద రోగంగా మారలేదు. చైనా మాత్రమే ఆ సమయంలో హాట్‌స్పాట్‌గా కనిపించింది. అప్పటికే కరోనా వైరస్ భయంతో అమెరికాలోని ప్రజలు టాయిలెట్ పేపర్, శానిటైజర్లను విపరీతంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం ప్రారంభించారు. టాయిలెట్ పేపర్‌కోసం కొట్టుకుంటున్న దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో అప్పుడు వచ్చాయి.
దానికితోడు అట్లాంటా నుంచి ఇండియా వెళ్ళే దారిలో ఉన్న సూపర్ మార్కెట్లో ఖాళీగాఉన్న ప్రదేశాలను, స్టాక్ నిల్వ ఉన్న రాక్లు ఖాళీగా ఉండటాన్ని మేము చూశాము. అట్లాంటా నుంచి ముంబై చేరుకున్నాము. ముంబైలో దిగిన తరువాత ఓ ఫారం నింపి ఇమ్మన్నారు. మనం ఎక్కడి నుండి వచ్చామో, భారతదేశానికి రాకముందు ఏ దేశాలు సందర్శించామో, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అన్న విషయాలతోపాటు, భారతదేశంలో మనం ఎక్కడ ఉంటున్నాం అనే విషయమై మనం అందులో రాసి ఇవ్వమని కోరారు. అవన్నీ అయిపోయాక మేము వైజాగ్ వెళ్ళాము. అక్కడ మార్చి 13 న జరిగిన 50వ వివాహ వార్షికోత్సవ వేడుకకు హాజరయ్యాము. అక్కడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, బెర్హంపూర్ వంటి భారతదేశంలోని వివిధ ప్రాంతాలను చూశాము. మాతోపాటు చాలామంది ప్రయాణించాము. దాదాపు 100 మంది కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉల్లాసంగా గడిపాము. స్థానిక అతిథులు. అతిథులలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు, ఎనభై వయస్సుల వారు కూడా మాతో గడిపారు.
మార్చి 19 న, జాతీయ టీవీలో కరోనా వైరస్ వ్యాధి గురించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను హెచ్చరించారు. మార్చి 22వతేదీ ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు 14 గంటల స్వచ్ఛంద ప్రజా కర్ఫ్యూను విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు డాక్టర్లకు, ఇతర అత్యవసర సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ ఐదు నిమిషాలు చప్పట్లతో, ఘంటానాదం మ్రోగించాలని కోరారు.
మరోవైపు అమెరికాలో కరోనా విజృంభించడంతో ఎంతోమంది ఆస్పత్రుల పాలవుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది. కాని ట్రంప్ మాత్రం ఇక్కడ అంతా బాగుందని అంటూ ఆ వైరస్ విషయాన్ని చిన్నదిగా చూసి చెప్పారు. భారత్‌లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి బాగా ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో మార్చి 24న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రెండవ టెలివిజన్ జాతీయ ప్రసంగంలో, ఈ అర్ధరాత్రి నుండి దేశంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రారంభించి, కేవలం మూడున్నర గంటల నోటీసుతో ఈ ప్రకటన వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మేము కూడా కొంత ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఎందుకంటే అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. దాంతో మేము ఇండియాలో చిక్కుకుపోయాము. కాకపోతే లాక్ డౌన్ పిరియడ్‌లో నిత్యావసర వస్తువులు, కిరాణా సామాగ్రి, మందులు మొదలైన దానికోసం ప్రజలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బయటికి వెళ్లడానికి అనుమతించారు. మేము నా సోదరి, బావమరిదితో కలిసి ఉన్నాము, కాబట్టి వసతిపరంగా మేము ఇబ్బందులు పడలేదు. కాని ఎన్నాళ్ళు ఇండియాలో చిక్కుకుపోతామేమో అన్న భయం కలిగింది. దానికితోడు యుఎస్‌లో ఉన్న మా పిల్లలు మా ఆరోగ్యం గురించి, అనిశ్చిత పరిస్థితుల గురించి భయపడుతూ మాకు ఫోన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మా కుమారులు హేమంత్, కిరణ్ ఓ సమాచారాన్ని అందించారు. దాని ప్రకారం భారతదేశంలో చిక్కుకున్న యుఎస్ పౌరులను మరియు గ్రీన్ కార్డ్ హోల్డర్లను స్వదేశానికి రప్పించడానికి అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని, దీనికోసం అమెరికా ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని నడుపుతోందని తెలియజేశారు.
చివరకు ఆ ప్రత్యేక విమానంలో ప్రయాణించడానికి కావాల్సిన ఏర్పాట్లను మేము చేసుకున్నాము. ఏప్రిల్ 5వ తేదీన మా ప్రయాణానికి సంబంధించిన సమాచారం వచ్చింది. ఏప్రిల్ 7, 10వ తేదీల్లో అట్లాంటా వెళ్ళే ప్రత్యేక విమానం ముంబై నుంచి బయలుదేరుతుందని సమాచారం వచ్చింది. మేము ఏప్రిల్ 10వ తేదీన అట్లాంటా వెళ్ళే విమానానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. ఏప్రిల్ 6వ తేదీన మాకు రాయబార కార్యాలయం నుంచి మా ట్రావెల్స్ కు సంబంధించిన పత్రాలు వచ్చాయి. ఏప్రిల్ 10వ తేదీ ఉదయం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఉన్న పార్క్ హయత్ హోటల్లో ఉండాలని కూడా అందులో పేర్కొన్నారు. దాంతో మేము వైజాగ్ నుంచి ట్యాక్సీలో హైదరాబాద్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాము. కాకపోతే ట్యాక్సీలో వెళ్ళడానికి అవసరమైన పోలీస్ పర్మిషన్‌కోసం కొంత ఇబ్బందులను పడాల్సి వచ్చింది. కలెక్టర్ ఆఫీసుకు, పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తిరిగి తిరిగి ఎలాగో పర్మిషన్ తీసుకుని మేము ఏప్రిల్ 9వ తేదీన వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు ట్యాక్సీలో బయలుదేరాము. హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ నుంచి ముంబైకి విమానంలో వెళ్ళి అక్కడ నుంచి అట్లాంటాకు బయలుదేరాము. అట్లాంటా చేరిన తరువాత 14రోజులు క్వారంటైన్లో ఉండి చివరకు మా కుటుంబంతో కలిసి హాయిగా ఉంటున్నాము. కాకపోతే ఈ కరోనా టైమ్‌లో మేము చేసిన ఇండియా ప్రయాణం మాత్రం మాకు మరచిపోలేని అనుభవాన్ని మిగిల్చింది.













