అందుకు కావాల్సినవన్నీ కాంగ్రెస్ కు ఉన్నాయ్ : రాహుల్
భారత్లో ఈ ఏడాది జరగబోయే 3-4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీను తాము చిత్తు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అందుకు అవసరమైన ప్రాథమిక వనరులన్నీ తమ పార్టీకి ఉన్నాయన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆశ్చర్యకర ఫలితాలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. మోదీ అజేయశక్తేమీ కాదని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ వాషింగ్టన్ లో ప్రముఖ భారతీయ అమెరికన్ ఫ్రాంక్ ఇస్లాం ఆతిథ్యమిచ్చిన ఓ కార్యక్రమంలో పలు అంశాలపై మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీలను నిలువరించడం సాధ్యం కాదని చాలామంది అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. భారత్లో తదుపరి జరిగే 3`4 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల తరహాలోనే చిత్తు చేయబోతోంది. కమలదళానికి ప్రజల మద్దతు లేదు. కానీ మీడియాను గుప్పిట్లో పెట్టుకొని తమకు ప్రజాబలం ఉందని ఆ పార్టీ గొప్పలు చెప్పుకొంటోంది అని పేర్కొన్నారు.













