షికాగోలో తెలుగు విద్యార్థుల అవస్థలు
మేం ఉండే ప్రాంతంలో సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్ల సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆహార పదార్ధాలు దొరికే దుకాణాలన్నీ మూతపడ్డాయి. యూనివర్సిటీల్లో మెస్‌లు తెరవడం లేదు. 3 రోజులుగా భోజనానికి అల్లాడుతున్నాం అంటూ అమెరికాలోని షికాగోలో ఉన్న ఇల్లినాయి వర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న పలువురు తెలుగు విద్యార్థులు వాపోతున్నారు. ఈ వర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన కుమార్ విష్ణు రమేష్.. పరిస్థితిని వివరించారు. ఇల్లినాయిలో లాక్డౌన్లో మే 30 వరకు పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడంతో మరిన్ని కష్టాలు తప్పడం లేదని పేర్కొన్నారు. మిగతా వర్సిటీలు, విద్యా సంస్థలనూ మూసేయడంతో హాస్టళ్లు, అద్దె గదుల్లో ఉంటున్న విద్యార్థులకు దిక్కుతోచడం లేదన్నారు. తమ వర్సిటీలో వివిధ కోర్సులు చదువుతున్న భారతీయులు 3 వేల మందికిపైగా ఉన్నారని స్వస్థలాలకు చేరేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఆయన వ్ఞిప్తి చేశారు.













