ఫ్లోరిడాలో టీసీఎస్ కార్యకలాపాల విస్తరణ
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. బీమా సంస్థ ట్రాన్స్ అమెరికాతో డీల్లో భాగంగా 430 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. ట్రాన్స్ అమెరికాకు చెందిన 1 కోటి పైగా బీమా పాలసీల నిర్వహణ కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగానే టీసీఎస్ పలువురు ఉద్యోగులను తీసుకుంటోంది. గడిచిన మూడేళ్లుగా అమెరికాలో దాదాపు 3 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశామని అత్యధికంగా ఉద్యోగావకాశాలు కల్పించిన టాప్ రెండు ఐటీ సర్వీసెస్ సంస్థల్లో తమది కూడా ఒకటని టీసీఎస్ పేర్కొంది.













