TANTEX: టాంటెక్స్ సాహిత్య సదస్సు…కోర్టు తీర్పులు సాహిత్య మెరుపులు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ‘’నెలనెల తెలుగువెన్నెల’’, తెలుగు సాహిత్య వేదిక 211వ సాహిత్య సదస్సు ఫిబ్రవరి నెల 16వ తేదీన ఆదివారంనాడు ‘‘లూయీస్ విల్’’ టెక్సాస్(Texas) నగరము నందు గల సమావేశమందిరము వేదికగా జరిగింది ‘’కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు’’ అంశంపై ముఖ్య అతిథి డాక్టర్ మంగారి రాజేందర్ జింబో ఉపన్యాసం చేసి ఆకట్టుకున్నారు.
తొలుత శ్రీ త్యాగరాజ కృత గేయం ‘‘మనసులోని మర్మమును తెలుసుకో’’ ప్రార్ధన గేయాన్ని శ్రీ లెనిన్ వేముల రాగయుక్తంగా ఆలపించడంతో సదస్సును ప్రారంభించడం జరిగింది. సాహితీ ప్రియులనందరినీ భాగస్వాములను చేస్తూ గత 81 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక ’మన తెలుగు సిరి సంపదలు’’ చాలా బాగా జరిగింది. చమత్కార గర్భిత పొడుపు పద్యాలు, ప్రహేళికలు. పొడుపు కథలు, నానార్ధములు సహా దాదాపు యాభై ప్రక్రియల లో ని వైవిధ్య భరితమైన తెలుగు భాషా పదసంపదను స్పృశించడం, అక్షర పద భ్రమకాలు ప్రశ్నలుగా సంధించి సమాధానాలను రాబట్టడంలో విజయవంతమైన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి వారిని పలువురు ప్రశంసించడం జరిగింది. తరువాత జరిగిన పుస్తక పరిచయ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రీయ సంగీత నిష్ణాతులు, రాగ విశ్లేషకులు పి.చంద్రమౌళి వ్రాసి కూర్చిన వ్యాస సంపుటి ‘’రాగశాల’’ పుస్తకాన్ని ప్రముఖ చలన చిత్ర సంగీత సాహిత్య సాహితీ విశ్లేషకులు మద్దుకూరి చంద్రహాస్ పరిచయం చేయడం జరిగింది.
ఈమాస పద్య సౌగంధం లో శ్రీమతి కాశీనాధుని రాధ శ్రీకృష్ణ దేవరాయల విరచిత (కృష్ణ చిత్తీయం )ఆముక్త మాల్యద పీఠికలో మొదటి పద్యం ‘’శ్రీ కమనీయ హారమణి…….వెంకట భర్త గొల చ్చెదన్’’ మొదలుగా గల పద్యాలను అద్భుతంగా పాడి సందర్భ సహిత వ్యాఖ్య చేయడం జరిగింది.సన్నివేశ వివరణ సమయములో శ్రీమతి రాధ గారి పద్యపఠన శైలి, వాక్చాతుర్యము, ఆనాటి రాయల కవితా రీతులను గుర్తుకుతేవడంతో సాహితీప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తరువాత ప్రముఖ సాహితీ విశ్లేషకులు శ్రీ లెనిన్ వేముల ‘శతక పద్యాలు – పురాణ కథలు’’ అంశంపై ప్రసంగిస్తూ మహాకవి వేమన పద్యమైన ఉప్పుకప్పురంబులోని ‘‘పురుషులందు పుణ్యపురుషులెవరయా’’ అనే పోలికకు ఒక ఉదాహరణగా వాలి సుగ్రీవుల వృత్తాంతాన్ని గురించి చెప్పారు. ముఖ్య అతిధి ప్రసంగానికి ముందు సంస్థ సమన్వయ కర్త శ్రీ దయాకర్ మాడా ముఖ్య అతిథి డాక్టర్ మంగారి రాజేందర్ జింబోగారి ని సాహితీ ప్రియులకు పరిచయం చేయడం జరిగింది.
న్యాయ స్థాన చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తెలుగులో అత్యధిక తీర్పులిచ్చిన విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ మంగారి రాజేందర్ జింబో మాట్లాడుతూ వివిధ కోర్టుల్లో తీర్పులిచ్చిన సమయములో తనకు కలిగిన అనుభవాలను రంగరించి తెలుగులో అనేక కథలను వ్రాయడం ద్వారా తెలుగు భాషపై తనకున్న ప్రేమను చాటుకునే అవకాశం కలిగినట్లు భావిస్తున్నానని తెలియ చేశారు. ముఖ్యంగా ముద్రిత పుస్తకాలు ‘’నేనూ నా నల్లకోటు’’, ‘’మనసు పెట్టి’’ ,’’కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు’’ , ‘’మా వేముల వాడ కథలు’’ ‘’జింబో కథలు’’ వంటి కథలతో కథా సాహిత్యం మీద తాను చెరగని ముద్ర వేసినట్లుగా పలువురి ప్రశంసలందుకొన్నట్లు పేర్కొన్నారు. తాను వ్రాసిన ప్రతి కథలోనూ ప్రస్తుత జన జీవనంలోని వాస్తవికతను ఆధారముచేసుకొని కథా వస్తువును రూపొందించడం జరిగిందన్నారు. తాను కుటుంబ సమస్యలను పరిష్కరించే న్యాయమూర్తిగా వున్నపుడు బాధితులు తెలిపిన కొన్ని సంఘటనలు తన దృష్టికి రావడంతో ఆయా కేసులలో యదార్ధ సంఘటనలు మూలంగా తీసుకొని అనేక కథలు వ్రాసినట్లు చెప్పుకొచ్చారు. తాను న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో చాలావరకు తెలుగులో తీర్పులిచ్చినట్లు, రాబోయే తరాలకు ఉపయోగ పడేలా ఎన్నో న్యాయశాస్త్ర గ్రంధాలను రచించి ప్రచురించినట్లు కూడా తెలియ చేశారు. తనలాగే ఇప్పుడు పనిచేస్తున్న న్యాయమూర్తులు కూడా వారిచ్చే తీర్పులను తెలుగులోనే ఇవ్వడం కొనసాగించగలరనే ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
’ఎన్ కౌంటర్ మరణాలు -న్యాయపాలన ‘’అన్న అంశంపై తాను సమర్పించిన థీసిస్ ద్వారా తనకు ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టో రేట్ లభించినట్లు పేర్కొన్నారు. డాక్టర్ మంగారి రాజేందర్ జింబో ప్రసంగాన్ని మెచ్చుకుంటూ డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్బు జొన్నలగడ్డ, చంద్రహాస్ మద్దుకూరి, కొండా తిరుమల రెడ్డి, లెనిన్ వేముల, దయాకర్ మాడ, శ్రీమతి కాశీనాధుని రాధ, శ్రీమతి రామ సీతామూర్తి,.నిడిగంటి గోవర్ధనరావు వంటి సాహితీ ప్రియులు తమస్పందనను తెలియ చేశారు. తరువాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి తరపున తక్షణ పూర్వాధ్యక్షులు శ్రీ సతీష్ బండారు, సంస్థ సమన్వయ కర్త శ్రీదయాకర్ మాడ నేటి ముఖ్య అతిథి డాక్టర్ మంగారి రాజేందర్ జింబో గారికి టాంటెక్స్ సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సన్మానించడం జరిగింది. ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈసన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొంటూ డాక్టర్ మంగారి రాజేందర్ జింబో తన కృతజ్ఞతను వెలిబుచ్చారు. టాంటెక్స్ ద్వారా ఇక్కడి తెలుగు వారు తెలుగు భాషాసాహిత్యానికి చేస్తున్న సేవ చాలా గొప్పదని ఆయన ప్రశంసించారు.
ఈ సాహిత్య కార్యక్రమానికి సతీసమేతంగా హాజరైన ముఖ్య అతిథి డాక్టర్ రాజేందర్ జింబో తోపాటు వారి కుటుంబ సభ్యులు అనురాగ్ మంగారి, రాకేష్ మంగారి, దీపక్ రాజా రోజనాల ఇంకా సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, శ్రీ చిన్న సత్యం వీర్నాపు, శ్రీ నివాస కుమారస్వామి రాజ, వారి సతీమణి పద్మజ, శ్రీ విజయ్ మందిరం, లెనిన్ తాళ్లూరి, లెనిన్ బంద, లెనిన్ వేముల, రాఘవేంద్ర అమిలినేని, సతీష్ గ్రంధి, శ్రీమతి శ్రీ రామ్ సీతా మూర్తి, శ్రీధర్ నంబూరు, గోవర్ధన రావు నిడిగంటి వంటి అనేక మంది సాహితీ ప్రియులు వీక్షించడంతో సదస్సు విజయవంతమైంది.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సమన్వయ కర్త దయాకర్ మాడ వందన సమర్పణ చేస్తూ ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి సంస్థ తక్షణ పూర్వాధ్యకులు శ్రీ సతీష్ బండారు, సమన్వయ కర్త దయాకర్ మాడా సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం ఈ సదస్సు విజయవంతానికి కృషి చేశారు.







