తానా యంగ్ తరంగ్ 2020కి అపూర్వ స్పందన
తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయాలను ప్రతిబింభించే విధంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా మహిళా విభాగం, కేఎల్‌యూ పూర్వ విద్యార్థుల సంఘం, జిజ్ఞాస సంయుక్తంగా కేఎల్ విశ్వవిద్యాయంలో తానా యంగ్ తరంగ్- 2020 ఉత్సవం పేరుతో వేడుకను ఇటీవల నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. అభ్యుదయ కళలు, సంస్కృతిపై జరిగిన పోటీల్లో రెండు రాష్ట్రాల్లోని సంప్రదాయాలను విద్యార్థుల కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. సాహిత్యం, నృత్యం, సంగీతం, వాచకం, పద్యపఠనం, సాంస్కృతిక వారసత్వం వంటి విషయాలపై విద్యార్థుల ప్రదర్శించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టిక అంశాలపై విద్యార్థుల మాక్ పార్లమెంట్ నిర్వహించారు. వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో క్యాట్‌వాక్ చేశారు. టాంజానియా దేశానికి చెందిన కేఎల్‌యూ విద్యార్థులు నీమా, మెర్సీ చీరకట్టి ఆకట్టుకున్నారు. విద్యార్థులు పంచ, లాల్చీలు ధరించారు. కూచిపూడి, జానపదం, పాశ్చాత్య నృత్యాలను విద్యార్థులు ప్రదర్శించారు. మిస్ ఆంధ్రప్రదేశ్, మిస్టర్ ఆంధ్రప్రదేశ్ పోటీలను కూడా నిర్వహించారు.
ముగింపు సభలో తానా అధ్యక్షు జయ్ తాళ్లూరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేసిన తొలి సంఘం తానా అని చెప్పారు. వివిధ రకాల సేవలు తెలుగు వారికి అందిస్తున్నామన్నారు. మన సంస్కృతిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలనే సంకల్పం తో వివిధ రాష్ట్రాల్లోని తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో యంగ్‌తరంగ్ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తానా మహిళా విభాగం కోర్‌కమిటీ అధ్యక్షురాలు శిరీషా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













