యాంటీ టొబాకో పోస్టర్ ను ఆవిష్కరించిన జే తాళ్ళూరి
పొగాకు నమలడం, పొగతాగడం ఎంత హానికరమో తెలియజేస్తూ, స్కోప్ సంస్థ చేస్తున్న ప్రచారానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కూడా మద్దతును తెలియజేసింది. వాషింగ్టన్ డీసీలో జూలై 4 నుంచి 6వ తేదీవరకు జరిగిన తానా 22వ మహాసభల్లో స్కోప్ సంస్థ ప్రచార పత్రికను తానా ప్రెసిడెంట్ జే తాళ్ళూరి, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్కోప్ మేనెజింగ్ ట్రస్టీ యాంటీ టొబాకో చైర్ పర్సన్ డా. చంద్రకాంతరావు, స్కోప్ సంస్థ ఓవర్సీస్ కో ఆర్డినేటర్ కె. సాయికుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
స్కోప్ సంస్థ ప్రారంభించిన ప్రచార కార్యక్రమాన్ని తొలుత 2004లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఈ సంస్థకు ట్రస్టీగా డాక్టర్ బి. పద్మజ వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా సాయికుమార్ రెడ్డి మాట్లాడుతూ, స్కోప్ సంస్థ ద్వారా టొబాకో సేవించడం వల్ల కలిగే దుష్ఫలితాలను ప్రచారం చేస్తూ, ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహనను కలిగిస్తున్నామని చెప్పారు. కోటి సంతకాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ చేస్తున్న ప్రచార కార్యక్రమానికి ఇప్పటికే పలువురు ఎన్నారైలు మద్దతు తెలిపారని, తానా, నాటాలాంటి సంస్థలు కూడా ఈ ప్రచారంలో పాల్గొనేందుకు అంగీకరించాయని చెప్పారు.













