Dr. LV. Gangadhara Sastry: గంగాధరశాస్త్రిని సత్కరించిన తానా నాయకులు
‘‘స్త్రీ అంటే శక్తిస్వరూపిణి …! నేను ఈ రోజు సంపూర్ణ భగవద్గీతను గానం చేసి, రికార్డు చేయగలిగానంటే అందుకు మా నాయనమ్మ రాజ్యలక్ష్మమ్మ, మా అమ్మ శ్రీలక్ష్మమ్మ ప్రధాన కారణాలైన శక్తిస్వరూపిణులు అని గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా ఎల్ వి గంగాధర శాస్త్రి (Dr. LV. Gangadhara Sastry) అన్నారు. హైదరాబాద్ మౌలాలి లోని ‘జాగృతి మహిళా మండలి’ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకురాలు శ్రీమతి కరుణ గోపాల్ తెలుగు మహిళలకు ఆదర్శమని, జాతికి ఆమె అందిస్తున్న సేవలు అనితర సాధ్యమని గంగాధర శాస్త్రి అన్నారు.
జాగృతి మహిళా మండలి అధ్యక్షురాలు, కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు శ్రీమతి అన్నపూర్ణ తన కుమారుడైన శ్రీ జగదీష్ ప్రభలను ఉత్తముడి గా తీర్చిదిద్దడం వల్లే ఇప్పుడాయన అమెరికా సాంస్కృతిక రంగంలో అతి సుప్రసిద్ధుడై తెలుగు సమాజానికి సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ఈ వేదిక పై ఉన్న తానా అధ్యక్షులు శ్రీ నాదెండ్ల గంగాధర్(Nadendla Gangadhar), తానా పూర్వ అధ్యక్షులు శ్రీ కోమటి జయరాం (Jayaram Komati), శ్రీ గారపాటి ప్రసాద్ (Garapati Prasad) లతో తన అనుబంధాన్ని, తెలుగు సమాజానికి వారు చేసిన సేవలను గంగాధర శాస్త్రి గుర్తుచేసుకున్నారు.
బాల్య దశనుంచే వారు నాకు ఆధ్యాత్మిక విశేషాలు చెబుతుండేవారు. శ్లోకాలు, స్తోత్రాలు, భగవద్గీత నేర్పించేవారు. ఈ అనుభవం తోనే చెబుతున్నా… మహిళా మూర్తులారా..! మీరు మీ పిల్లలతో మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత వంటి విలువైన విషయాలను పంచుకుంటూ తగిన సమయం గడపండి…! బాల్య దశనుంచే మీ పిల్లలకు భగవద్గీత నేర్పండి.. నైతిక విలువల, ధర్మ మార్గ ప్రబోధానికి ఇంతకు మించిన గ్రంధం ప్రపంచం లోనే లేదు.. ఇంట్లో మీ పిల్లలతో తెలుగు లోనే మాట్లాడండి. సహనము, సామర్ధ్యము, సమాజాన్ని ధర్మ మార్గం లో నడిపించడం లో స్త్రీ దే ప్రధానమైన పాత్ర… శకుంతల, సీత, ద్రౌపది, ఛత్రపతి శివాజీ మాతృ మూర్తి జిజియాబాయి లు మహిళా జాతికి ఆదర్శం… ఒక పక్క ఆర్ధిక బలాన్ని పెంచుకోవడం తో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ఎందరికో స్ఫూర్తినిచ్చే స్థాయికి ఎదిగిన నేటి స్త్రీని హృదయ పూర్వకం గా అభినందిస్తూనే… మరో పక్క ‘నా ఇష్టం’ పేరుతో ఆధునికత, స్వేచ్చ,స్వాతంత్య్రాలను దుర్వినియోగం చేసుకుంటూ …పదిమందినీ ఆకర్షించేందుకు అభ్యంతరకర దుస్తులు ధరించడం… బొట్టు తీసెయ్యడం, జుట్టు విరబోసుకోవడం… ధూమపానం, మద్యపానం సేవించడం …పబ్బులలో ఆనందం వెతుక్కోవడం… సునాయాసం గా ధనార్జన కొరకు ఆలోచించడం… అందుకోసం మగవాడి బలహీనతను ఉపయోగించుకోవడానికి కూడా వెనుకాడకపోవడం నేటి సమాజం లో కనిపిస్తోందని గంగాధర శాస్త్రి విచారం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.







