మాతృభాషపై తానా సదస్సు విజయవంతం
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’’ సందర్భంగా 2022 ఫిబ్రవరి 21న రాత్రి 8:30(భారత కాలమానం ప్రకారం)కు అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాల దృశ్య సమావేశం వైభవంగా జరిగింది. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలుగు భాషా వైభవాన్ని వివరించారు. పర దేశంలో ఉంటూనే మాతృభాషను పరిరక్షించి పరివ్యాప్తం చేయడంలో తానా చేస్తున్న కృషిని వివరిస్తూ కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరికీ ఆహ్వానం పలికారు. ముందుగా ఇటీవలే మృతిచెందిన ఆంధ్ర ప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖామాత్యులు మేకపాటి గౌతమ్ రెడ్డితో పాటు ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత నాగళ్ల గురుప్రసాద రావుల మృతి పట్ల తానా తరపున తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర వారికి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా. కంభంపాటి హరి బాబును సభకు పరిచయం చేసి ఆహ్వానం పలికారు.
గవర్నర్ డా. కంభంపాటి హరి బాబు మాట్లాడుతూ.. మాతృదేశానికి ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉంటూ కూడా ‘నెల నెలా తెలుగు వెన్నెల’ పేరిట తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా వివిధ సాహిత్య సదస్సులు నిర్వహిస్తూ ఇప్పుడు 32వ సమావేశం జరుపుకుంటున్న తానా సంస్థకు అభినందనలు తెలియజేశారు. భారత రాజ్యాంగం లోని 53 వ అధికరణం ప్రకారం ప్రాధమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాభోధన జరగాలి, కేంద్రప్రభుత్వ 2020 నూతన విద్యావిధానం అనుసరించి కనీసం 5 వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధనతో పాటు ఇంజనీరింగ్ లాంటి వృత్తి విద్యలలో కూడా మాతృభాషలో విద్యాబోధన జరిగేటట్లు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మాతృభాషాభిమానంతో ప్రతి ఒక్కరూ మన తెలుగు భాషను నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఏటా ఫిబ్రవరి 2 1వ తేదిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడానికి కారణం అప్పటి తూర్పు పాకిస్తాన్, ఇప్పటి బంగ్లాదేశ్లో అత్యధికంగా బెంగాలీ భాష మాట్లాడే ప్రజలపై అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూ భాషను జాతీయ భాషగా బలవంతంగా రుద్దింది. దీంతో అక్కడి బెంగాలీలు తీవ్ర నిరసన తెలియజేశారు. ఆ నిరసన మహోద్యమంలో ఫిబ్రవరి 21, 1952లో ఎంతో మంది మరణించడం, కొన్ని వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ విషాదకర సంఘటనలను ఐక్యరాజ్యసమితి గుర్తించి 2000 సంవత్సరం నుండి ఏటాఫిబ్రవరి 21వ తేదీని అన్ని దేశాలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది’’ అని అన్నారు.
గౌరవ అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ పిల్లంగోల్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. అంగ్ల భాష ఎంతో అవసరం అయినప్పటికీ దాని మోజులో పడి మన మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఒక విషయాన్ని మనం మాతృభాషలో అర్ధం చేసుకున్న వివరంగా ఇతర భాషల్లో అర్ధం చేసుకోలేమని, పరిపాలనా భాషగా కూడా తెలుగు విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మరో గౌరవ అతిథి మిజోరాం కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.ఆర్.ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ.. మిజోరాం రాష్ట్రం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడుకున్నదని తెలిపారు. అటు అక్షరాస్యతలోనూ అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం అని అన్నారు. చాలా తక్కువమంది తెలుగు వారు ఉన్నప్పటికీ వివిధ రంగాల్లో మంచి ఖ్యాతి గడిస్తున్నారని గుర్తు చేశారు. మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో శరవేగంతో ప్రగతి పథంలో మిజోరాం దూసుకుపోతుందన్నారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన ఈ ‘‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ’’ వేడుకల్లో వివిధ రాష్ట్రాల నుండి తెలుగు ప్రముఖులు పాల్గొని ఆయా రాష్ట్రాలలో తెలుగు వారి సంఖ్య, తెలుగు భాషను నిలబెట్టుకోవడానికి వారు చేస్తున్న కృషిని వివరించారు. అలాగే వివిధ హోదాలలో పనిచేస్తూ తెలుగు ఖ్యాతిని నిలబెడుతూన్న అధికార, అనధికార ప్రముఖులు, తెలుగు సంఘాల పాత్ర, తెలుగు రచయితలు యిత్యాది అంశాలపై అత్యద్భుతంగా సమగ్ర విశ్లేషణ చేశారు.
దాట్ల దేవదానం రాజు, పుదుచ్చేరి (యానాం)
ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, తమిళనాడు
యజ్ఞ నారాయణ, కేరళ
విజయభాస్కరరెడ్డి, మహారాష్ట్ర
డా. తుర్లపాటి రాజేశ్వరి, ఒడిశా
లండ రుద్రమూర్తి, ఛత్తీస్ గడ్
రాపోలు బుచ్చిరాములు, గుజరాత్
వింజమూరి బాలమురళి, పశ్చిమ బెంగాల్
ఆచార్య యన్. లక్ష్మి అయ్యర్, రాజస్తాన్
కమలాకర రాజేశ్వరి, న్యూఢిల్లీ నుండి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధి, గౌరవ అతిధులకు, విశిష్ఠ అతిధులకు, సహకారం అందిస్తున్న ప్రసార మాధ్యమాలకు డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఫిబ్రవరి 27న ‘‘తెలుగు తల్లికి పద్యాభిషేకం’’ అనే సాహిత్య కార్యక్రమం అంతర్జాలం వేదికగా జరుగుతుందని తెలిపారు.













