తానా ఫౌండేషన్ ఉత్తర అమెరికా – చేయూత పోగ్రాం 2020-21 – ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంస్థ గత పలు సంవత్సరాలుగా విద్యా రంగంలో చేస్తున్న ఒక బృహత్తర కార్యక్రమం ‘చేయూత.’ ఈ కార్యక్రమం ద్వారా పేదరికంతో బాధపడుతూ, చదువు ఆగిపోయే ప్రమాదం ఉన్న ప్రతిభ గల యువతకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి ఉన్నత చదువులు సక్రమంగా సాగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం తూర్పు గోదావరి జిల్లాలో 40 మంది విద్యార్థులకు 2 లక్షల రూపాయలు వితరణ చేయడం జరిగింది.
ఇప్పటి వరకు కొన్ని వందల స్కాలర్ షిప్ లు ఈ పోగ్రాం ద్వారా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి స్వయంగా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న వారు శశికాంత్, ప్రియాంక వల్లే పల్లి, కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల బృందం.
అలాగే, తానా లీడర్ షిప్ లో ఉన్న జయ శేఖర్ తాళ్ళూరి, నిరంజన్, మిగతా సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ పేదరికంతో ఏ పిల్లవాడి చదువూ ఆగిపోకూడదు అనే సంకల్పంతో పని చేస్తున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తానా సంస్థకు కృతజ్ఞతలు తెలుపుకుని, తాము కూడా ఒక స్థాయికి చేరుకున్న తరువాత తమలాంటి మరి కొంత మందికి తోడ్పాటు అందించి ఈ చేయూత కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళతామని ప్రతిజ్ఞ చేసారు. పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఎక్కడో అమెరికా ఉన్న తానా సంస్థ తమ పిల్లల గురించి ఆలోచించి, ఈ రకంగా తమ కుటుంబాలను ఆదుకోవడం చాలా గొప్ప విషయం అని, వాళ్ళంతా తమ కటుంబాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని కాకినాడలో గల మహర్షి సాంబమూర్తి సంస్థ ప్రాంగణంలో పడాల చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు నిర్వహించడం జరిగింది.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిఐజి శ్రీ మోహన్ రావు, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నా నయీమ్ అస్మీ మాట్లాడుతూ తానా ఫౌండేషన్ లాంటి ధార్మిక సంస్థల ద్వారా వందల మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళడం సమాజానికి గొప్ప మేలు చేసే ప్రయత్నం అని అభినందించారు.
కాకినాడలో గల పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజమహేంద్రవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













