TANA: తెలుగువైభవాన్ని చాటేలా తానా 24వ మహాసభలు… కాన్ఫరెన్స్ కో ఆర్డినేటర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ఈసారి డెట్రాయిట్ వేదికైంది. జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జరగనున్నది. ఈ మహాసభలకు కో ఆర్డినేటర్‌గా ఉదయ్ కుమార్ చాపలమడుగు వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో జన్మించిన ఉదయ కుమార్ చాపలమడుగు తానాలో వివిధ కీలక పదవులను నిర్వహించారు. తానా మహాసభల ఏర్పాట్లపై ఆయనను అడిగినప్పుడు చెప్పిన విషయాలు…
ఈసారి తానా మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేశాము. ఇందుకోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. 54 కమిటీలను ఏర్పాటు చేశాము. ఈ కమిటీల్లో దాదాపు 300 మంది అహోరాత్రులు కాన్ఫరెన్స్ విజయంకోసం పనిచేస్తున్నారు. కాన్ఫరెన్స్ లీడర్ షిప్ వాళ్ళు ఈ కమిటీలతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ అవసరమైన సూచనలను సలహాలను అందిస్తున్నారు.
ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశాము, తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఉట్టిపడే కార్యక్రమాలతోపాటు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులతోపాటు, అమెరికాలో ఉన్న పలువురు కళాకారులకు కూడా వేదికగా నిలిచేలా వారి కార్యక్రమాలను ప్రదర్శించేలా ఏర్పాట్లు జరిగాయి. తెలుగు సాహిత్యంపై అవగాహన పెంచేలా సాహితీవేత్తలతో, ఇతరులతో ప్రసంగాలను ఏర్పాటు చేశాము. మహాసభలకు వస్తున్న రాజకీయ ప్రముఖులను దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి ఉపయోగపడే అంశాలపై చర్చా కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నాము. సినీ హీరోలు, హీరోయిన్‌లు, దర్శకులు ఇతరరంగాలవారితో మీట్ అండ్ గ్రీట్ వంటి కార్యక్రమాలు ఉంటాయి.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో అందరినీ ఆకట్టుకున్న ప్రముఖ సినీ సంగతీ దర్శకుడు తమన్, ప్రముఖ గాయని చిత్రతో సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేశాము. సినీ నేపథ్య గాయకురాలు సునీత, గాయకుడు ఎస్.పిబి. చరణ్‌తో కూడా లైవ్ మ్యూజిక్ కార్యక్రమం ఉంటుంది. వీరితోపాటు నేపథ్య గాయనీగాయకులు కూడా ఈ మహాసభల్లో తమ పాటలతో ఆనందపరచనున్నారు. ప్రముఖ హీరోయిన్ సమంత ఈ మహాసభలకు వస్తున్నారు. తెలుగు కమ్యూనిటీ మహాసభలకు ఆమె రావడం ఇదే మొదటిసారి. అలాగే మరో హీరోయిన్ ఐశ్వర్యరాజేష్ కూడా హాజరవుతున్నారు. సెలబ్రిటీలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉంటుంది. అన్నమాచార్య స్వరార్చన పేరుతో శ్రీమతి శోభారాజు కార్యక్రమం కూడా ఉంటుంది.
ఈ మహాసభలకు సినిమా, సాహిత్యం, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు వస్తున్నారు. ఆధ్యాత్మిక వేత్తలు కూడా ఈ మహాసభలకు వచ్చి తమ సందేశాలను అందించనున్నారు. అమెరికాలో ఉన్న పలువురు ప్రముఖులను, నిష్ణాతులను కూడా మహాసభలకు వస్తున్నారు.
మహాసభలకు వచ్చే అతిధులకోసం రిజిస్రేషన్ కార్యక్రమాలను ప్రారంభించాము. సాధారణ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జూలై 4, 5వ తేదీ వరకు జరుగుతుంటాయి. వచ్చిన అతిధులకోసం అక్కడికి సమీపంలో ఉన్న హోటళ్ళలో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించడం జరిగింది. కాన్ఫరెన్స్‌కు వచ్చే అతిధులు, ఇతరులకోసం ఆతిధ్య ఏర్పాట్లను అందరికీ సరిపోయే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ విషయంలో ఆయా కమిటీలు ఏర్పాట్లను చేస్తున్నాయి. ఎంతోమంది వస్తున్న ఈ తానా మహాసభలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని ఉదయ్‌కుమార్ చాపలమడుగు కోరారు.







