TANA: అట్లాంటాలో తానా కళాశాల ప్రాక్టికల్స్ పరీక్షలు విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) అమెరికాలోని మన స్టూడెంట్ల కోసం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్.పి.ఎం.వి.వి) సహకారంతో కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక గాత్రం మరియు వీణలలో వివిధ స్థాయిలలో తరగతులను నిర్వహించి వార్షిక థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఉత్తీర్ణులైన వారికి డిప్లొమాలు అందిస్తోంది. స్థానికంగా ఉన్న కళాకారులు తానా కళాశాల ద్వారా తమ కళను మెరుగుపరుచుకునే అవకాశం ఈ కళాశాల ద్వారా లభించింది. ఎస్.పి.ఎం.వి.వి విశ్వవిద్యాలయం మార్గదర్శకాల ప్రకారం తానా కళాశాల బృందం అట్లాంటాలో ప్రాక్టికల్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలకు మంచి స్పందన వచ్చింది.
అట్లాంటా నుండి మొత్తం 24 మంది విద్యార్థులు వివిధ కోర్సులు, వివిధ స్థాయిలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. హాల్ టికెట్ ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లితండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు, ఇది తానా కళాశాల పనితీరును తెలియజేసింది. కర్ణాటక గాత్రంలో 40 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న శ్రీవల్లి శ్రీధర్ ను తానా అట్లాంటా బృందం ఘనంగా సన్మానించింది. శాస్త్రీయ కళలలో యువ ప్రతిభను పోషించడంలో ఆమె చేసిన కృషికి గాను ఈ సన్మానం చేశారు. ఈ సందర్భంగా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కళాశాల నిర్వాహక కమిటీ చేసిన కృషిని అట్లాంటా బృందం అభినందించింది.
అలాగే రాబోయే సంవత్సరాలలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి ఉన్న ప్రణాళికలను కూడా ఈ బృందం పంచుకుంది. పరీక్షా కేంద్రంగా స్థలాన్ని, అన్ని సౌకర్యాలను కల్పించినందుకు తానా, మేధా ఎడ్యు -మోహిని ముత్యాల గారికి హృదయపూర్వక ధన్యవాదాలను నిర్వాహకులు తెలియజేశారు. అనేక సంవత్సరాలుగా తానా కళాశాలకు ఈ కేంద్రమే పరీక్షా వేదికగా ఉంది. ఈ కార్యక్రమం గొప్ప విజయవంతం కావడానికి నిరంతరం మద్దతు అందించిన వారికి తానా ధన్యవాదాలు తెలియజేసింది.
మాలతి నాగభైరవ (కళాశాల చైర్), శ్రీనివాస్ లావు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (తానా), అంజయ్య చౌదరి లావు (మాజీ అధ్యక్షుడు), మధుకర్ యార్లగడ్డ (ఫౌండేషన్ ట్రస్టీ), సోహిని అయినాల-మహిళా సేవల సమన్వయకర్త సునీల్ దేవరపల్లి`సాంఘిక సంక్షేమ సమన్వయకర్త, శ్రీనివాస్ ఉప్పు, మురళి బొడ్డు తదితరులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.
సౌత్ ఈస్ట్ తానా ప్రాంతీయ ప్రతినిధి శేఖర్ కొల్లు, తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, తానా వైస్ ప్రెసిడెంట్ శ్రీని లావు, తానా కళాశాల నిర్వాహకులు మాలతి నాగభైరవ తదితరులు ఇందులో పాల్గొన్న స్టూడెంట్లకు అభినందనలు తెలియజేశారు.