తామా భారత గణతంత్ర దినోత్సవం – దేశభక్తి చాటిన అట్లాంటా వాసులు
జనవరి 26న తామా (తెలుగు అసోసియేషన్ అఫ్ మెట్రో అట్లాంటా) కార్యాలయంలో భారత 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. విపరీతమైన చలిని కూడా లెక్కచేయకుండా సుమారు 100 మందికిపైగా అట్లాంటావాసులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ మాతృ దేశభక్తిని చాటారు.
ముందుగా సాంఘికసేవా కార్యదర్శి సాయిరామ్ కారుమంచి అందరినీ ఆహ్వానించి, ఎన్నో సంవత్సరాలుగా తామా క్రమం తప్పకుండా జాతీయ పండుగలు చేస్తోందని తెలిపారు. అటు పిమ్మట ముఖ్య అతిథులు నాగార్జునా విశ్వవిద్యాలయం విశ్రాంత లెక్కల ఆచార్యులు శ్రీ. ప్రభాకర్ కడియాల, రాయచూరు రైతు శ్రీ. నాగేశ్వరరావు వలిచేటి, వరంగల్ విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ. సోమయ్య కాసాని జండా వందనం గావించారు. అందరూ జాతీయగీతం ఆలపించి, వందనం చేసి భారతావనిపై తమకున్న గౌరవాన్ని తెలియజెప్పారు. ముఖ్య అతిథులకు రామ్ మద్ది, అంజయ్య లావు పుష్పగుచ్ఛాలు అందజేశారు. సారే జహాఁసె అచ్చా, మా తెలుగు తల్లికి మల్లెపూదండ వంటి దేశభక్తి గేయాలను చిన్నపిల్లలు మరియు పెద్దవారు శ్రద్ధగా ఆలపించారు.
శ్రీ. ప్రభాకర్ గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాల ప్రాముఖ్యతను వివరిస్తూ, వాటి మధ్య వ్యత్యాసం ఏమిటన్నది, ముఖ్యంగా చిన్నపిల్లలకు అర్ధమయ్యే రీతిలో వివరించారు. శ్రీ. నాగేశ్వరరావు రైతుగా తన అనుభవాలు, చిన్ననాటి గణతంత్ర దినోత్సవ స్మృతులు పంచుకున్నారు. శ్రీ. సోమయ్య దేశభక్తి పెంపొందించే విషయాలు వివరించి, జైహింద్, భారత్ మాతా కీ జై వంటి నినాదాలు చేయించారు. పిదప కొంతమంది తమ అనుభవాలు, గణతంత్ర దినోత్సవ ఘనత, పౌరుల బాధ్యతలు మున్నగు విషయాల గురించి మాట్లాడారు.
ఈ సందర్భంగా తామా కార్యాలయాన్ని దేశ నాయకుల చిత్రపటాలతో, జెండాలతో, మువ్వన్నెల తోరణాలతో అందంగా అలంకరించారు. ఇంతమంది కలిసి ఇలా మన జాతీయ పండుగను చేసుకోవటం ప్రశంసనీయమనీ, ఈ కార్యక్రమం భారత దేశంలో చిన్నప్పుడు తమ బడులలో జరిగినట్లు ఉందనీ, ఆ రోజులను తామా వారు తమకు గుర్తుచేసినందుకు మరియు తమ పిల్లలను ఇందులో భాగం చేసినందుకు ఎంతోమంది హర్షం వ్యక్తం చేసారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా అందరికీ పునుగులు, తేనీరు మరియు మిఠాయిలు అందజేశారు. చివరిగా ఈ కార్యక్రమాన్నివిజయవంతం చేసిన ఆహుతులందరికీ, సహాయం చేసినవారికీ తామా అధ్యక్షులు భరత్ మద్దినేని, బోర్డు ఛైర్మన్ రాజశేఖర్ చుండూరి కృతజ్ఞతాభినందనలు తెలియజేసి ముగించారు.













