ఆకట్టుకున్న తాజా సంక్రాంతి సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్ ఏరియా (తాజా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. తాజా అధ్యక్షులు శ్రీ మహేష్ బచ్చు సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఆధ్యంతం అందరినీ అలరించాయి. ప్రాంగణాన్నంతా సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు అలంకరించారు.
కార్యక్రమానికి దాదాపుగా 600 మంది సభ్యులు హాజరయ్యారు. సాంప్రదాయ పిండి వంటలు, ముగ్గుల పోటీలు, పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను నిర్వహించారు. ఫ్యాన్సీ డ్రెస్ పోటీలలో పది సంవత్సరాలలోపు పిల్లలు రైతులుగా, కొత్త అల్లుడులాగా, హరిదాసులాగా చాలా అందంగా తయారయి వచ్చారు.
జ్యోతి ప్రజ్వలన చేసి, శ్రీనాథ్ ఆశీర్వచనాలతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. కూచిపూడి, కోలాటం, నాటికలను, పాటలను, నృత్యాలను ఎంచుకొని బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘‘మన గోపికలు’’ వారు అన్నమయ్య కీర్తనకు చేసిన కోలాటం సభికులందరినీ అలరించినది. నృత్యాంజలి, దేవీ తత్వం, తాళ తరంగిణి, లిటిల్ చార్మర్స్, సప్త స్వరాలయం, కుందనపు బొమ్మలు, సామజ వరగమన నాటిక, బుట్ట బొమ్మలు, ఇండియన్ రిధం, బీట్ బ్రేకర్స్, అప్సరలు తదితర కార్యక్రమాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.
మాతృ భాషా సేవ చేస్తున్న అధ్యాపకులను తాజా కార్యవర్గ సభ్యులు సత్కరించారు. శ్రీనాధ్ జాక్సన్విల్లే దేవాలయములో పురోహితులుగా పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ‘‘సువర్ణ గండ పెండేరం’’తో పాటు ‘‘పురోహిత బ్రహ్మ’’ అనే బిరుదుతో ఘనంగా సత్కరించారు.
తాజా అధ్యక్షులు మహేష్ బచ్చు అధ్యక్షోపన్యాసం చేస్తూ.. గత సంవత్సర కాలంగా తమ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరించారు. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని, తెలుగు వారు అందరూ కలిసి ఉంటూ, ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండాలని, ఆపత్కాలంలో పలువురికి తాజా ఏవిధంగా సాయపడిరదో సవివరంగా తెలియచేసారు. కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి కీలకపాత్ర పోషించినటువంటి తోటి కార్యవర్గ సభ్యులను ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు. 2024 నూతన అధ్యక్షుడిగా ఎంపికైన మల్లి సత్తి తన నూతన కార్యనిర్వాహక బృందాన్ని, సభకు పరిచయం చేశారు. కార్యక్రమములో హనుమాన్ చాలీసా పారాయణం జరిగినది. ప్రాంగణమంతా హనుమాన్ చాలీసాతో మార్మోగిపోయింది. ఆసమయంలో ఆహూతులందరు భక్తి పారవశ్యంలో మునిగిపో యారు. తాజా వారు అందరికీ అయోధ్య రామాలయ అక్షింతలు పంచిపెట్టారు. అమెరికా, భారతదేశ జాతీయ గీతాలతో తాజా సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి.
ఇరవైకి పైగా వంటకాలతో సంక్రాంతి విందు భోజనం వడ్డించారు. తెలుగు మిఠాయిలు, తినుబండరాళ్లు, పచ్చళ్ళు, పొడులు, పులిహోర, పెరుగన్నం, వంకాయ, ఇతర ఆహార పదార్థాలతో ఆహుతులకు తెలుగింటి భోజనం రుచి చూపించారు. స్థానిక ‘‘మా కిచెన్’’ ఇండియన్ రెస్టారెంట్ వారు తయారు చేసిన ఈ విందును అతిథులు ఆస్వాదించారు. తాజా సంక్రాంతి సంబరాలకు వాసవీ గ్రూపు, పెర్సిస్, బిర్యానీ ఇండియన్ గ్రిల్ తదితరులు స్పాన్సర్లుగా వ్యవహరించి ఈ కార్యక్రమాల విజయవంతానికి ఆర్థిక సహకారం అందించారు.







