వేలానికి స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తు
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన కంప్యూటర్ దిగ్గజ కంపెనీ-యాపిల్ సహవ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ చిన్నతనంలో ఉద్యోగం కోసం పెట్టుకున్న దరఖాస్తు (సివి) ఇప్పుడు వేలానికి వచ్చింది. తప్పులతో కూడి ఉన్న ఈ కర్రికులం విటే (సివి) వేలంలో రూ.32 లక్షలు (దాదాపు 50 వేల డాలర్లు) తెచ్చిపెడుతుందని వేలం నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ సివిని ఆయన 1973లో రూపొందించారు. టెక్నాలజీ రంగలో పనిచేయడం తన అభిలాష అంటూ ఆయన అందులో పేర్కొన్నారు. ఒకే పేజీ ఉన్న ఈ సివిలో అనేక అక్షర దోషాలున్నాయి. స్టీవెన్ జాబ్స్ అని పేరును, రీడ్ కాలేజ్ అని అడ్రస్‌ను సివిలో ఇచ్చారు. 18 ఏళ్ల వయస్సప్పుడు ఆయన ఈ సివిని పెట్టుకున్నారు. అయితే ఏ స్థాయి ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నది పేర్కొనలేదాయన. బోస్టన్‌కు చెందిన ఆర్ఆర్ ఆక్షన్ హౌస్ దీన్ని వేలం వేయనుంది. వచ్చే నెల వేలం ప్రక్రియను చేపట్టనున్నారు. మార్చి 8 నుంచి ఈ సివిని వేలానికి బిడ్డింగులు ఆహ్వనిస్తున్నారు. ఈ దరఖాస్తు పంపుకున్న మూడేళ్లకు (1976లో)జాబ్స్, స్టీవ్ ఓజనైక్తో కలసి యాపిల్ సంస్థను ప్రారంభించారు. 2011లో క్యాన్సర్ కారణంగా జాబ్స్ కన్నుమూశారు.













