మరింతమందికి సేవలందిస్తా… శ్రీనివాస్ కూకట్ల
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ ట్రస్టీగా ఆంధ్రప్రదేశ్లోని అద్దంకి మండలానికి చెందిన శ్రీనివాస్ కూకట్ల ఎన్నికయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలం తిమ్మాయపాలెం లో రైతు కుటుంబంలో కూకట్ల సుబ్బారావు మరియు వింధ్యావళి దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన శ్రీనివాస్ కూకట్ల ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే పూర్తి చేసుకుని, హైదరాబాద్ జే.ఎన్.టి.యు లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి అమెరికాలో మాస్టర్స్ చేశారు.
గతంలో తానాలో ఆయన వివిధ పదవులను నిర్వహించే ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు. తానా ఈవెంట్స్ కో ఆర్డినేటర్, క్యాపిటల్ రీజియన్ తానా కేర్స్ అడ్ హాక్ కమిటీ సభ్యునిగా, తానా ఐటీ బిజినెస్ ఇస్యూస్ కమిటీలో, తానా తెలుగు స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ కమిటీలో సభ్యునిగా ఉన్నారు. అలాగే మేరీలాండ్ తెలుగు అసోసియేషన్ తొలి ప్రెసిడెంట్ గా కూడా ఆయన పనిచేశారు. ప్రస్తుతం తానాలో ఫౌండేషన్ ట్రస్టీగా ఎన్నిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఫౌండేషన్ తరపున తెలుగురాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలను పెద్దఎత్తున చేయనున్నట్లు ఈ సందర్భంగా శ్రీనివాస్ కూకట్ల తెలిపారు. తనను ఈ పదవికి ఎన్నుకున్నందుకు తానా బోర్డ్ మెంబర్లకు, సభ్యులకు ఇతరులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.













