తానా ప్రెసిడెంట్ పదవి కోసం బరిలో దిగిన శ్రీనివాస గోగినేని
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రెసిడెంట్ ఎలక్ట్ పదవికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు శ్రీనివాస గోగినేని ప్రకటించారు. రమారమి గత 20 సంవత్సరాలుగా తానా కార్యక్రమాల్లో పాల్గొని 12 సంవత్సరాలకు పైగా అనేక పదవులు ఆయన చేపట్టారు. ముఖ్యంగా 2015-17 తానా ఫౌండేషన్ చైర్మన్గా అయన చేసిన సేవలు అందరికీ తెలిసిందే. అమెరికాలోని సుమారు 20 రాష్ట్రాల్లో ‘‘మన ఊరికోసం’’ నినాదంతో మొదలుపెట్టి చేసిన 5కే రన్స్ కార్యక్రమాల మూలంగా తానా సంస్థ సేవలపై ప్రత్యేక అవగాహనా కల్పిస్తూ సమీకరించిన కోట్లాది రూపాయలను తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలకు వినియోగించారు. చైతన్య స్రవంతి కార్యక్రమం ద్వారా కంటిచూపు క్యాంపులు, కాన్సర్ నివారణ క్యాంపులు, గ్రహణం మొర్రి సర్జరీస్, డిజిటల్ మరియు పుస్తక లైబ్రరీస్, రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు, విద్యార్థి స్కాలర్షిప్లు, వారధి ద్వారా అనేకమంది పిల్లలకు చదువులు మొదలైన కార్యక్రమాలకు ఖర్చు చేసి వేలాది మందికి లబ్ది కలిగించారు. అంతేగాక తానా కాన్ఫరెన్స్ సెక్రటరీగాను, తానాబోర్డు లోను, బైలాస్ కమిటీ మొదలు అనేక పదవుల్లో విశిష్ట సేవలందించారు.
తానాలో సంస్థాగతంగా నెలకొన్న పెత్తందారీ వ్యవస్థను, ధన ప్రాబల్యంతోను, బలవంతపు బాలట్ కలెక్షన్ తోనూ నిర్వహించే ఎన్నికల తంతును బహిరంగంగా విమర్శిస్తుంటారు. ఇప్పుడు కూడా ‘‘తానా మనందరిదీ’ అంటూ పోటీ చేస్తూ పెత్తందారీ వ్యవస్థను, ధన ప్రాబల్యంను, బలవంతపు బాలట్ కలెక్షన్ను ఖండించాలని కొత్త సంస్కరణలు, విలువల పరిరక్షణతో తానాను తిరిగి గర్వపడేలా చేయడంలో తనతోపాటు కలిసిరావాలని కోరుతూ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.













