సింధూరంతో జాగ్రత
హిందువులు ఎక్కువగా ధరించే సింధూరంలో ప్రమాదకర స్థాయిల్లో సీసం ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. దీని కారణంగా పిల్లల్లో ఎదుగుదల సమస్యలు, బుద్ధిమాంద్యం తలెత్తే అవకాశాలున్నాయని వెల్లడైంది. అమెరికాలోని రట్జర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. భారత్, అమెరికాల నుంచి సింధూర నమూనాలనున సేకరించి వారు పరీక్షలు జరిపారు. అమెరికాలో 83శాతం, భారత్లో 78శాతం నమూనాల్లో, ఒక గ్రామ్ సింధూరం పొడిలో కనీసం ఒక మైక్రోగ్రామ్కు సీసం గుర్తించినట్లు పేర్కొన్నారు. అమెరికా ఆహార, ఔషధ పరిపాలన సంస్థ (ఎఫ్డీఏ) సౌందర్యోత్పత్తులకు సంబంధించి, ఒక గ్రామ్ పొడిలో సీసం 20 మైక్రోగ్రాములకు మించకూడదని పరిమితి విధించింది. అయితే భారత్లో 43శాతం, అమెరికాలో 19శాతం నమూనాల్లో ఈ పరిమితిని దాటి సీసం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. సీసానికి ప్రమాదరహిత స్థాయి అంటూ ఏదీ లేదని, అసలు సీసం లేకుండా ఉంటేనే సింధూరాన్ని అనుమతించాలని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. సీసం, ఇతర భార లోహాల వల్ల మూత్రపిండ, కాలేయ, చర్మ వ్యాధులు కూడా తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు.













