SiliconAndhra: సిలికానాంధ్ర రికార్డు
సిలికానాంధ్ర (SiliconAndhra) సంస్థ మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. బే-ఏరియా (Bay Area) లో ఇటీవల ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఒకేసారి పట్టభద్రులయ్యారు. ఈ సందర్భంగా ఒకేసారి మూడు స్నాతకోత్సవాలు నిర్వహించినట్లు సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ వెల్లడించారు. సంపద (సిలికానాంధ్ర మ్యూజిక్, ఆర్ట్స్, డ్యాన్స్ అకాడమీ) నుంచి 230 విద్యార్థులు, సిలికానాంధ్ర మనబడి నుంచి 412 మంది, ఆరియా విశ్వవిద్యాలయం నుంచి 62 మంది మొత్తం 704 మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఈ రికార్డు సాధన వెనుక కృషి చేసిన అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, సిలికానాంధ్ర నిర్వాహకులకు ఆనంద్ అభినందనలు తెలిపారు.
జార్జియాలో…
జార్జియాలోని రాయల్ బాంక్వెట్ హాల్‌లో జూన్ 7, 8 తేదీలలో జరిగిన సిలికానాంధ్ర మనబడి ప్రాంతీయ సదస్సు విజయవంతమైంది. ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు, వాలంటీర్లు, నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ‘‘ఉన్నత శిఖరాలను చేరుకుందాం’’ అనే ప్రేరణాత్మక నినాదంతో ప్రారంభమైన ఈ సదస్సు, సంస్థాగత మార్పు, తెలుగు భాషా విద్యాభివృద్ధిపై దృష్టి సారించింది.అధికారిక కార్యక్రమాలు గౌతమ్ కస్తూరి ప్రార్థనతో ప్రారంభమయ్యాయి. అనంతరం సదస్సు అధ్యక్షులు విజయ్ రావిళ్ల అందరినీ స్వాగతించి, జార్జియాలో మనబడి కార్యకలాపాల గురించి వివరించారు. మనబడి కులపతి మరియు అధ్యక్షులు రాజు చామర్తి, సంస్థ పయనం, ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలపై కీలకోపన్యాసం ఇచ్చారు. భవిష్యత్ తరాలకు తెలుగు భాషను మరింత విస్తరించాలన్న ప్రణాళికలను వివరించారు. ఈ సదస్సులో పలు ఇంటరాక్టివ్ సెషన్లు జరిగాయి. ముఖ్య అతిథిగా భారత కాన్సులేట్ జనరల్ ఆఫీస్ నుండి రమేష్ బాబు లక్ష్మణన్ గారు విచ్చేసి, మాతృభాష ప్రాముఖ్యత, పిల్లలపై దాని ప్రభావం గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు. మనబడి కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లను ఆయన ప్రశంసించారు. పలువురు ప్రముఖులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు.







