Sri Sri Ravi Shankar: శ్రీశ్రీ రవిశంకర్ సేవలకు అమెరికా నగరాల్లో అరుదైన గుర్తింపు
ప్రపంచవ్యాప్తంగా శాంతి, మానవతా విలువల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ (Sri Sri Ravi Shankar) సేవలను గుర్తిస్తూ అమెరికాలో రెండు నగరాలు ప్రత్యేక గౌరవాలను ప్రకటించాయి. సియాటెల్ నగరం అక్టోబర్ 19వ తేదీని అధికారికంగా ‘శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం’గా (Sri Sri Ravi Shankar Day) ప్రకటించింది. మానసిక ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నిర్మించడం, మత సామరస్యాన్ని పెంపొందించడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సియాటెల్ ప్రభుత్వం తెలిపింది. ఇదే క్రమంలో వాషింగ్టన్‌లోని వాంకూవర్ నగరం కూడా అక్టోబర్ 18వ తేదీని ‘గురుదేవ్ రవిశంకర్ దినోత్సవం’గా ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా సియాటెల్ మేయర్ బ్రూస్ హారెల్, వాంకూవర్ మేయర్ కెన్ సిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 180 దేశాల్లో 8 కోట్ల మందికి పైగా ప్రజలను శ్రీశ్రీ రవిశంకర్ (Sri Sri Ravi Shankar) ప్రభావితం చేశారని కొనియాడారు. రవిశంకర్ స్థాపించిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ (Art of Living) సంస్థ నిర్వహించిన ఒత్తిడి నిర్మూలన, యువ నాయకత్వ, సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజల్లో మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు సంఘర్షణల నివారణకు, శాంతి స్థాపనకు దోహదపడ్డాయని వారు పేర్కొన్నారు.







