శంకర నేత్రాలయ కార్యక్రమాలకు మంచి స్పందన
అమెరికాలోని ఆరిజోనాలో శంకర నేత్రాలయ యూఎస్ఏ భారీగా విరాళాలు సేకరించింది. ఫీనిక్స్లోని ఈ ఆస్పత్రి వర్గాలు ప్రజల్లో ఈ ఆర్గనైజేషన్ గురించి అవేర్నెస్ పెరిగేందుకు తాజాగా ఒక కార్యక్రమం నిర్వహించారు. దీనిలో ప్రముఖ తెలుగు గీత రచయిత అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. సినిమాలకు కాకుండా తను వ్యక్తిగతంగా రాసుకున్న కవితలు, పాటలను ఆయన వినిపించడంతో ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా సంతోషించారు. ప్రముఖ తెలుగు సింగర్ రఘు కుంచె తన పాటలతో అందర్నీ అలరించారు. మోనాషా జోషీ నేతృత్వంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందం భజనతో అందరూ మంత్ర ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఎస్యూ (మొబైల్ ఐ సర్జికల్ యూనిట్) అడాప్ట్ ఎ విలేజ్ (గ్రామాలను దత్తత తీసుకునే) ప్రోగ్రాంలో పాల్గొన్న భాగంగా రేఖా రెడ్డి, ఆదిశేష రెడ్డి.. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో కేశపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అలాగే పల్లవి కోవూరు, ధీరజ్ పోలా కుటుంబం అన్నమయ్య జిల్లాలని రాజంపేటలో 11 రోజుల ఐ-క్యాంప్ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా శంకర నేత్రాలయ యూఎస్ఏ సుమారు 30 వేల డాలర్ల విరాళాలు సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫీనిక్స్కు చెందిన ప్రముఖ లీడర్లు శ్రీని గుప్తా, రూపేష్ రెడ్డి, శ్యామ్ బైరా, అంజల్ రెడ్డి, రఘు గాడి, నాగేష్ పుప్పాల, చెన్న సానికొమ్ము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని శంకర నేత్రాలయ ఇక్కడ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ సంస్థకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.













