Sankara Nethralaya: శంకరనేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది

శంకర నేత్రాలయ (Sankara Nethralaya) మిచిగన్ చాప్టర్ ఆధ్వర్యంలో మూడవ వార్షిక 5కే వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 14th, 2025 స్థానిక నోవై నగరంలోని ఐటీసీ స్పోర్ట్స్ పార్క్‌లో జరిగింది.
ఈ కార్యక్రమాన్ని డెట్రాయిట్ చాప్టర్ తరఫున ట్రస్టీలు ప్రతిమ కొడాలి, రమణ ముదిగంటి, చాప్టర్ లీడ్స్ వెంకట్ గోటూరు, విజయ్ పెరుమాళ్ళ, వాలంటీర్లు సాయి గోపిశెట్టి, సుజాత తమ్మినీడి, తేజ జెట్టిపల్లి, వంశీ గోపిశెట్టి, యూత్ వాలంటీర్లు సమన్వయపరిచారు. శంకర నేత్రాలయ ప్రెసిడెంట్ డాక్టర్ బాలరెడ్డి ఇందుర్తి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ సూచనలు అందజేశారు. టి. త్యాగరాజన్ టెక్నికల్ సహాయం అందజేసారు.
ఈ కార్యక్రమంలో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు నేత్ర శిబిరాల కార్యక్రమాలు, వాటి వివిధ గణాంకాలు, భారత దేశంలో సంస్థ నిర్వహిస్తున్న నేత్ర చికిత్సల గురించి తెలియజెప్పే బోర్డులు ప్రదర్శించారు. శంకర నేత్రాలయ చేస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేయడం, అదేవిధంగా సభ్యులను ఉత్తేజ పరిచి వారిని ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేలా చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం సాగింది. ఎంతోమంది పాత, కొత్త మెంబర్లు ఈ కార్యక్రమానికి హాజరై 5కే వాక్‌లో పాల్గొన్నారు.
శంకర నేత్రాలయను 1978లో పద్మభూషణ్ డాక్టర్ ఎస్ బద్రీనాథ్ స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం అందరికీ నేత్ర చికిత్సలు, నేత్ర సంబంధిత వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చేయడం. శంకర నేత్రాలయ యు.యస్.ఎ, ఫౌండర్ ఎస్వీ ఆచార్య డెట్రాయిట్ చాప్టర్ బృందానికి తమ అభినందనలు తెలిపారు. శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రెసిడెంటు బాల రెడ్డి ఇందుర్తి, కార్యదర్శి వంశీకృష్ణ ఎరువారం, కోశాధికారి మూర్తి రేకపళ్ళి, స్పోర్ట్సు కమిటీ చైర్ రమేశ్ చాపరాల, వాలంటరీ కమిటీ చైర్ రత్నకుమర్ కవుటూరు తమ సహాయ సహకారాలను అందించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా ప్రతిమ కొడాలి, రమణ ముదిగంటి కార్యక్రమం ఉద్దేశాన్ని, శంకర నేత్రాలయ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. సాయి గోపిశెట్టి 5కే వాక్ ఉద్దేశాన్ని, వివరాలను సభ్యులకి తెలియజేశారు. 5కే వాక్ ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటమే కాకుండా శంకర నేత్రాలయ నిర్వహిస్తున్న కార్యక్రమాలకి తమ వంతు సహాయాన్ని అందిస్తూ డొనేషన్లు అందజేశారు. అందరూ తమ వంతు ప్రయత్నంగా తమ స్నేహితులకి శంకర నేత్రాలయ ఆర్గనైజేషన్ గురించి వివరిస్తామని అందరికీ తెలిసేలా పాటుపడతామని తెలిపారు.
పలువురు స్పాన్సర్లు (రెస్టౌరెంట్ రావుగారి విందు, శ్వీట్ టైంస్, SPARC, మెగాస్టార్ ఫాన్స్, ప్రసాద్ కాట్రగడ్డ, శ్రీదేవి గోగినేని) కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు ఆర్థిక సహాయం అందించి ఉపకరించారు. నోవై హైస్కూల్ విద్యార్థులు పలువురు ఈ కార్యక్రమానికి వాలంటీర్లుగా పనిచేశారు. తర్వాత ఈ 5కే వాక్‌లో రెండు కేటగిరీలుగా విజేతలను ప్రకటించారు. విజేతలకు దాతల చేతులమీదుగా ప్రైజులను ప్రదానం చేయించారు. ఈ కార్యక్రమంలో హాజరైన సభ్యులకు, కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందించిన పలువురు సభ్యులకు, శంకర నేత్రాలయ కార్యనిర్వాహక సంఘం డెట్రాయిట్ చాప్టర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. శంకర నేత్రాలయ గురించి వివరాలను వారి వెబ్ సైట్ sankaranethralayausa.org నుంచి తెలుసుకోవాల్సిందిగా కోరారు.