సింగపూర్ అభివృద్ధిలో భాగస్వాములైనట్లే ఏపీలోనూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళుతోందని, మరింత వేగవంతమైన అభివృద్ది సాధనకు సహకారం అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలను కోరారు. సింగపూర్ పర్యటనలో ఉన్న లోకేశ్ పలువురు పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. అమరావతి భాగస్వామ్య కార్యాలయ డైరెక్టర్ ఫ్రాన్సిస్, సింగపూర్ సహకార వాణిజ్య సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. సింగపూర్ అభివృద్ధి భాగస్వాములైనట్లే ఏపీలోనూ పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్రంలో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు.
రాష్ట్ర విభజన తర్వాత పలు సమస్యలు అధిమించి 11.22 శాతం వృద్ధిరేటు సాధించాం. కాగిత రహిత పాలన అందిస్తున్నాం. సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో ఉన్నాం. కంపెనీల ఏర్పాటుకు ఏకగవాక్ష విధానంలో 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నాం. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌తో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం. విమానాశ్రయాలు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. ఐటీ హబ్‌గా విశాఖను, ఉత్పత్తి రంగ హబ్‌గా రాయలసీమను, ప్రోత్సాహక విధానంలో రాయితీలతో రాష్ట్రాన్ని తయారీరంగ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం అని అన్నారు.
భారత్‌లో 30 శాతం ఫోన్లు ఏపీలోనే తయారవుతున్నాయి. 200 రకాల మొబైల్ విడిభాగాల కంపెనీలకు ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధికి ప్రత్యేకంగా క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ పార్కు ఏర్పాటుకు సహకరించాలి అని లోకేశ్ కోరారు.













