మంచి కొవ్వులు అధికంగా తీసుకున్నా చేటే!
మంచి కొవ్వులు అధికంగాగల ఆహారాన్ని అతిగా తీసుకున్నా చేటేనని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. కాలేయ వ్యాధులతోపాటు రక్తపోటు, మధుమేహం లాంటి ముప్పులు పెరిగేందుకు ఇవి తోడ్పడతాయని చెబుతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు దీన్ని నిర్వహించారు. సంతృప్త లేదా అసంతృప్త కొవ్వులు, సుక్రోజ్ లేదా పిండి పదార్థాలను భిన్న మోతాదుల్లో కలుపుతూ కేలరీలు అధికంగా ఉండే నాలుగురకాల ఆహార పదార్థాలను వారు సిద్ధం చేశారు. వీటిని నాలుగు వర్గాల ఎలుక పిల్లలతో ఆరు నెలలపాటు కడుపు నిండుగా తినిపించారు. అనంతరం వాటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో పిండి పదార్థం, అసంతృప్త కొవ్వులు అధికంగాగల ఆహారాన్ని తీసుకున్న ఎలుకల కాలేయం చుట్టూ 40 శాతం ఎక్కువగా కొవ్వు పేరుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. వాటి కాలేయాలు కాస్త ఉబ్బినట్లు కనిపించాయని, కడుపులో చనిపోయిన కొవ్వు కణాలు గుట్టలుగా పేరుకున్నాయని, వాపు సంకేతాలనూ గుర్తించామని పరిశోధకులు తెలిపారు. ఇవే రక్తపోటు, మధుమేహ ముప్పులు పెంచుతున్నట్లు వివరించారు.













