గూగుల్ సిఇఒతో ఐటీ మంత్రి భేటీ
కేంద్ర ఐటిశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్తో సమావేశమయ్యారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో భారత్లో సాంకేతికాభివృద్ధి, యూజర్లకు అంతర్జాల సేవలు మరింత చేరువకావడం వంటి అంశాలపై వీరు చర్చించారు. భారత్లో పర్యావరణ అనుకూల వృద్ధిలో కంపెనీలు, ఇన్వెస్టర్లు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ గూగుల్ కార్యాలయాన్ని సందర్శించారు. పిచాయ్తో భేటీ అనంతరం ఆయన గూగుల్ ప్రతినిధులతో కూడా చర్చించారు.
కాలిఫోర్నియాలో పర్యటిస్తున్న రవి శంకర్ ప్రసాద్ పలు సంస్థల సిఇఒలు, ప్రతినిధులతో సమావేశమవుతూ భారత్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి వివరిస్తున్నారు. ప్రధానంగా సైబర్ భద్రత, డేటా గోప్యత, తదుపరి తరంలో టెక్నాలజీలో చోటు చేసుకోనున్న మార్పులు, భారత్లో వాటి అభివృద్ది వంటి అంశాలపై ఆయన చర్చించారు. భారత్ అభివృద్ధికి డిజిల్ పేమెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, డిజిటల్ విప్లవానికి దోహదం చేస్తున్నాయని ఈ సందర్భంగా రవిశకంర్ ప్రసాద్ అన్నారు. దేశ పౌరులకు సాంకేతికత ఆధారంగా ఉపాధి కల్పిచడంలో భారత ప్రభుత్వానికి గూగుల్ వంటి సంస్థలు తోడ్పడుతున్నాయని అన్నారు. సుందర్ పిచాయ్ మాట్లాడుతూ ఐటి మంత్రితో సమావేశం పట్ల హర్షం వ్యక్తం చేశారు.













