అమెరికాలో గాంధీ చిత్రం వేలం
మహాత్మా గాంధీ అరుదైన చిత్రాన్ని అమెరికాలో వేలం వేశారు. గాంధీ, మదన్ మోహన్ మాలవీయతో కలిసి నడుస్తున్న ఈ ఫోటో వేలంలో 41,806 డాలర్లు (సుమారు రూ.27 లక్షలు) పలికింది. ఈ చిత్రంపై ఎం కె గాంధీ అని ఫౌంటెయిన్ పెన్‌తో సంతకం చేసి ఉంది. అది 1931 సెప్టెంబరులో లండన్‌లో రెండో సెషన్ భారత రౌండ్ టేబుల్ సమవేశం అనంతరం తీసిన ఫొటో అని బోస్టన్‌కు చెందిన ఆర్ ఆర్ వేలం సంస్థ వెల్లడించింది. భారత నేషనల్ కాంగ్రెస్ తరపున గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. లండన్‌లో 1930 నుంచి 1932 మధ్య బ్రిటన్ మూడు సార్లు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. గాంథీ ఈ పొటోపై సంతకం చేసిన సమయంలో కుడి చేతి బొటనవేలులో నొప్పితో బాధపడుతున్నారని వేలం సంస్థ తెలిపింది. ఆయన 1931 ఆగస్టు 8 నుంచి డిసెంబరు 19 వరకు ఎడమ చేతితోనే రాశారని, ఆ సయమంలోనే ఈ ఫొటోపై సంతకం చేశారని వేలం సంస్థ తెలిపింది. ఆర్ ఆర్ వేలం సంస్థ ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు పలువురు ప్రముఖుల ఉత్తరాలు ఆటోగ్రాఫ్‌లు, కళాకృతులను వేలం వేసింది. ఈ వేలంలో కార్ల్ మాక్స్ రాసిన ఓ ఉత్తరం 53,509 డాలర్లుకు అమ్ముడు పోయింది.













