ఎన్ఆర్ఐల ఉద్యమాలతోనే కాంగ్రెస్ పుట్టుక
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి వింత వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్ఐల ఉద్యమాలతోనే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్, ఆజాద్, పటెల్ వంటి నేతలు ఎన్ఆర్ఐలేనని చెప్పుకొచ్చారు. అమెరికా పర్యటలో ఉన్న రాహుల్ గాంధీ న్యూయార్క్ లో ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశ స్వాతంత్య్ర కోసం పాటుపడిన నాయకుల్లో చాలామంది విదేశాల్లో ఉండి తిరిగి భారత దేశానికి వచ్చిన వాళ్లేనని రాహుల్ చెప్పుకొచ్చారు.
మన దేశ ప్రముఖుల్లో ప్రతీఒక్కరూ విదేశాలకు వెళ్లి, బాహ్య ప్రపంచం గురించి తెలుసుకున్న తర్వాతే స్వదేశానికి వచ్చి వారి ఆలోచనలను దేశాభివృద్ధికి ఉపయోగించారని చెప్పారు. దేశంలోని ప్రతీ ఒక్కరూ పాలు తాగేలా కృషి చేసిన ఘనత కురియన్కే దక్కుతుందన్నారు. కురియణ్ ఎన్ఆర్ఐ అయినప్పటికీ భారత దేశాన్ని మార్చేందుకు నిరంతరం పరితపించారని చెప్పారు. వేలాదిమంది ఎన్ఆర్ఐలు భారత్కు సేవ చేశారని తెలిపారు. అమెరికాలోని భారతీయులతో తన భేటీ అయిన సందర్భంలో భారత్లో పెరుగుతున్న మతహింస గురించే చర్చించారని తెలిపారు. తనను కలసిన వారిలో చాలామంది భారత్లో సహనం సామరస్యం ఎందుకు దెబ్బతింటోందని ప్రశ్నించారని చెప్పారు.













