అగ్రరాజ్యంతో డిఫెన్స్ డీల్స్…
భారత్ -అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయి. ప్రధానిగా మోదీ.. అగ్రరాజ్యంతో సంబంధాలను అత్యున్నతస్థాయిలో నిలిపేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని… పలుదేశాలతో రక్షణ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే అమెరికాతో ద్వైపాక్షిక బంధం బలోపేతంపై దృష్టిపెట్టారు. ఇవికాక.. క్వాడ్, ఇతర దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
నియంత్రణలను గాడిలో పెట్టడం, హై-టెక్ కామర్స్‌ను మరింత విస్తరించడం, ఇరు దేశాలు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు మార్గం సుగమం చేయడం వంటివాటిపై భారత్- అమెరికా దృష్టి పెడుతున్నాయి. ఇనీషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫలితాలను అమలు చేయడంలో భాగంగా మొదటి వ్యూహాత్మక వాణిజ్య చర్చలు జూన్ 4, 5 తేదీల్లో జరగబోతున్నాయి.
ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్స్ రెగ్యులేషన్స్, ఎక్స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేషన్స్ కారణంగా అమెరికన్ కంపెనీలు, భారత దేశ కంపెనీలతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి అడ్డంకులు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని తొలగించి, ఇరు దేశాల కంపెనీలు సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయనున్నారు. మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జూన్ 22న సమావేశమవుతారు.
ఈ నెల 19 నుంచి 21 వరకు జపాన్‌లో జరిగే జీ-7 సదస్సు, ఈ నెల 24న జరిగే క్వాడ్ సదస్సు సందర్భంగా కూడా మోదీ, బైడెన్ కలిసే అవకాశం ఉంది. ఫార్ పసిఫిక్ నేషన్స్ క్రిటికల్ ఎంగేజ్మెంట్లో భాగంగా పపువా న్యూగినియాలోని పోర్ట్ మోర్స్‌బైలో కూడా వీరిరువురూ కలవవచ్చు. సోలోమన్ దీవుల్లో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఫార్ పసిఫిక్‌తో భారత దేశం విస్తృత స్థాయి సంబంధాలను ఏర్పరచుకుంటోంది. ఈ దీవికి 100 మిలియన్ డాలర్ల రుణాన్ని మోదీ ప్రకటించబోతున్నారు.
తేజస్ మార్క్-2 కోసం భారత దేశంలో ఎఫ్-414 జెట్ ఇంజిన్లను సంయుక్తంగా తయారు చేయడం కోసం అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ చేసిన దరఖాస్తుకు అమెరికా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆమోదం మోదీ అమెరికా పర్యటనకు ముందే లభించే అవకాశాలు ఉన్నాయి. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీకి యూరోపియన్ యూనియన్‌లో ఉన్న అనుబంధ కంపెనీలు కూడా భారత దేశానికి వచ్చే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కంపెనీలు ఎఫ్-414 ఇంజిన్లను భారత దేశంలోనే తయారు చేస్తాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా డ్రోన్లు సృష్టిస్తున్న ఇబ్బందులను తిప్పి కొట్టడానికి ఉపయోగపడే సాయుధ డ్రోన్లను భారత దేశానికి సరఫరా చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది.













