ట్రంప్ పాలనలో కఠినం కానున్న ఇబి5
అమెరికాలోని ఎన్నారైలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్, వలస విధానంపై రోజురోజుకు కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ తీరుతో ఎన్నారైలతో పాటు అమెరికాకు వలస వచ్చినవారు ఇబ్బందులపాలవుతున్నారు.
అమెరికాలో అత్యధికమంది ఎన్నారైలు హెచ్-1బీ వీసాతో అమెరికాలో స్థిరపడ్డారు. మారిన పరిస్థితులు, నిబంధనల కారణంగా ఆ వీసాపై ఉద్యోగం చేస్తున్న వారందరి పరిస్థితి దినదిన గండంగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉండటమే కాదు, ఏకంగా శాశ్వత పౌరసత్వం పొందడానికి ఉన్న ఈబీ-5వీసాపై కూడా ట్రంప్ దృష్టి పడింది. కనీసం ఒక మిలియన్ డాలర్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా 10మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తే, గ్రీన్‌కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అయితే, ఈ ఈబీ-5 విషయంలోనూ నిబంధనలకు కఠిన తరం చేయాలని ట్రంప్ ప్రభుత్వం అనుకుంటోంది. దీని కనీస పెట్టుబడిని 5మిలియన్ డాలర్లకు పెంచనున్నారని అమెరికన్ కాంగ్రెస్‌మెన్ ఆరోన్ స్కాక్ చెబుతున్నారు. అయితే, పెట్టుబడి పెంపునకు సంబంధించి ఈ ఏడాది డిసెంబరు వరకూ ఎలాంటి మార్పు ఉండబోందని అంటున్నారు.
‘ఈబీ-5 కార్యక్రమాన్ని సెప్టెంబరు వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటివరకూ పెట్టుబడి విషయంలో పెరుగుదల ఉంటుందని నేను అనుకోను. కొత్త సెషన్ ప్రారంభమైన తర్వాత పెట్టుబడి విషయంలో మార్పులు ఉండవచ్చు” అని రిపబ్లికన్ పార్టీకి చెందిన స్కాక్ పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఈబీ-5వీసాలను పొందే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏటా 30-40 శాతం వృద్ధి నమోదవుతోంది. వచ్చే 3-4నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. గత 30ఏళ్లుగా పెట్టుబడి మొత్తం స్థిరంగా ఉందని, అందులో ఎలాంటి మార్పులు చేయలేదని అన్నారు.
ఈ వీసాలకు సంబంధించి యూకే 2మిలియన్ డాలర్లకు పెంచగా, కెనడా ఒక మిలియన్ డాలర్లకు, ఆస్ట్రేలియా 4 మిలియన్ డాలర్లకు పెంచిందని తెలిపారు. ఈబీ-5వీసా కార్యక్రమం కింద ఏటా 10వేలమందికి అమెరికా వీసాలను మంజూరు చేస్తోంది. ఈ వీసాలు పొందే జాబితాలో భారత్మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో చైనా, వియత్నాం ఉన్నాయి.













