చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షలు
అమెరికాలో పనిచేస్తున్న చైనా కంపెనీల ఉద్యోగులపై వీసా నిషేధ ఆంక్షలు విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రకటించింది. టెలికాం రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న హువావేతో సహా పలు కంపెనీలకు ఇది వర్తిస్తుంది. మానవ హక్కుల్ని కాలరాయడంలో ఈ కంపెనీలు చైనా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. సున్నితమైన డేటా గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో 5జి నెట్వర్క్ పనుల నుంచి హువావేను నిషేధిస్తున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన ఒక్కరోజు వ్యధిలోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.
హువావే వంటి కంపెనీల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై చైనా నిఘా విధిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఏ కంపెనీలైనా ఇలాంటి కంపెనీతో వ్యాపారం చేస్తున్నట్లుయితే వారంతా మానవ హక్కులను కాలరాస్తున్నవారితో వ్యాపారం చేస్తున్నట్లేనని పాంపియో చెప్పారు. టెలికాం రంగంలో ఈ సంస్థ సేవల్ని వినియోగించుకుంటే పౌరుల గోప్యతకు భంగం కలిగినట్లేనని అమెరికా తన మిత్రదేశాలన్నింటికీ చెబుతోంది. 5జీ పనుల నుంచి ఈ కంపెనీని తొలగించాలన్న బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాన్ని పాంపియో స్వాగతించారు. సురక్షితమైన, సమర్థవంతమైన 5జీ వ్యవస్థను తీసుకురావడంలో యూకేతో కలిసి పనిచేస్తామని చెప్పారు. భారత్లోని జియో సహా ప్రపంచంలో అనేక సంస్థలు హువావే పరికరాలను నిషేధించాయని తెలిపారు. అమెరికాతో వాణిజ్యం కొనసాగించాలంటే ఈ సంస్థను పక్కన పెట్టాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలకు సూచించారు. గోప్యత పరంగా ఈ కంపెనీ సురక్షితమైనది కాదన్నారు.













