అమెరికా కాంగ్రెస్ లో ప్రధాని మోదీ ప్రసంగం…
ఉగ్రవాదంపై పోరులో శషభిషలు, సమర్థనలకు తావు లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అమెరికన్ కాంగ్రెస్ ఉభయసభలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. టెర్రరిజం మానవాళికి శత్రువని దానిని ప్రేరేపించే దేశాలను శిక్షించాల్సిందేనని తేల్చి చెప్పారు. పాకిస్థాన్ ప్రేరిత తీవ్రవాదం, ఉక్రెయిన్ సంక్షోభం, చైనా దుందుడుకుతనాన్ని మోదీ ఎండగట్టారు. అమెరికాలో 9/11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు దాటింది. ముంబైపై ఉగ్ర దాడి జరిగిన 12 ఏళ్లు. అయినప్పటికీ ర్యాడికలిజం, ఉగ్రవాదం ఇప్పటికీ యావత్ ప్రపంచానికి ముప్పే. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, ఎగుమతి చేసే శక్తుల పీచమణచాలి అని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభం ఐరోపాకు యుద్ధాన్ని తెచ్చి పెట్టింది. ఇది యుద్దాల శకం కాదని మళ్లీ చెబుతున్నాను. ఇందులో ప్రధాన శక్తుల ప్రమేయం ఉండడంతో యుద్ద ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రత్యేకించి వర్ధమాన దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రక్తపాతాన్ని ఆపడానికి మనందరం శాయశక్తులా కృషి చేయాలి. దౌత్యంతో ముందుకెళ్లాలి అని పిలుపిచ్చారు.
భారత్, అమెరికా కలిసి పంచుకునే విలువల్లో ప్రజాస్వామ్యం కీలకమైనదని మోదీ తెలిపారు. దీర్ఘకాలంగా అదివికసిస్తూ వివిధ రూపాలు, వ్యవస్థలుగా పరిఢవిల్లుతోందన్నారు. భారత్ ప్రజాస్వామ్యానికే తల్లి అని మోదీ వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా కృత్రిమ మేధ (ఎఐ)లో చాలా అభివృద్ధి సాధించాం. ఇదే సమయంలో వేరే ఏఐ (అమెరికా`ఇండియా)లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ శతాబ్దం ఆరంభంలో అమెరికాతో మా రక్షణ బంధం పెద్దగా లేదు. ఇప్పుడు మాకెంతో ముఖ్యమైన రక్షణ భాగస్వాముల్లో ఈ దేశమూ ఒకటైంది అని గుర్తు చేశారు.
ప్రతినిధుల సభ, సెనేట్నుద్దేశించి రెండు సార్లు ప్రసంగించిన మొదటి భారత ప్రధానిగా మోదీ అరుదైన ఘనత సాధించారు. అంతేకాదు గంట పాటు ఆంగ్లంలో ప్రసంగించి కాంగ్రెస్ సభ్యులను ఆయన ఆకట్టుకున్నారు. పలు సార్లు నిలబడి కరతాళ ధ్వనులు చేయడం విశేషం.













