NATS: పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు
నాట్స్ అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ డల్లాస్ (NATS Dallas) విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్ సంస్థ సంయుక్తంగా పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు వేల ఆహార కిట్లను సిద్ధం చేశాయి. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, స్థానిక తెలుగు ప్రజలు, విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొని ఆహార కిట్లను సిద్ధం చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం వెనుకబడిన దేశాల్లో వేల మంది చిన్నారుల ఆకలి తీర్చడంలో దోహద పడనుంది. మానవ సేవే మాధవ సేవ అనే నాట్స్ చేపట్టే అనేక కార్యక్రమాల్లో ఉంటుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచుతాయని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పాన్ని, సమిష్టి శక్తిని చూపించడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలే మంచి ఉదాహరణలు అని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల అన్నారు.
కార్యక్రమంలో నాట్స్ సహ కోశాధికారి రవి తాండ్ర, నాట్స్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, నాట్స్ డల్లాస్ జట్టు సభ్యులు బద్రి బియ్యపు, పద్మసుందరి రాతినం, శ్యామల తూనుగుంట్ల తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డల్లాస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.







