డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి నిరసనగానే ఈ దాడి
కెన్యా రాజధాని నైరోబిలో హోటల్‌పై జరిగిన దాడిలో మృతుల సంఖ్య 21కి పెరిగింది. మృతుల్లో అమెరికా, బ్రిటన్ పౌరులు కూడా వున్నారు. జెరూసలేంను ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చర్యకు ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడినట్లు ఆల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్ షాబాబ్ ప్రకటించింది. పైవ్‌స్టార్ డ్యూసిట్ డి2 హోటల్, నైరోబిలోని వాణిజ్య సముదాయంపై రాళ్ళు, గ్రెనెడ్లు విసిరింది తామేనని సోమాలికి చెందిన ఆల్ షాబాబ్ పేర్కొంది. దాదాపు 20 గంటల పాటు హోటల్‌ను మొత్తం తన అధీనంలోకి తీసుకుని మరణకాండ సృష్టించారు. ఈ దాడిలో మరణించిన వారిలో అమెరికన్ సిఈఓ జాసన్ స్పిండ్లర్(40) వున్నారు. న్యూయార్క్‌లో 9/11 దాడుల్లో బతికి బయటపడ్డ స్పిండ్లర్ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. కాగా వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు ఉగ్రవాదులను ఏరిపారేశాయి. ఉగ్రవాదులు ఒక ప్రకటన చేస్తూ, ట్రంప్ తీసుకున్న తెలివితక్కు నిర్ణయానికి మూల్యం చెలించినట్లు చెప్పారు. కాగా, కెన్యాలోని ఇజ్రాయిల్ ఎంబసీ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.













